‘కోడెల’ కోసం రూటు మారిన బైపాస్‌!

Guntur district officials have prepared for the construction of Bypass road through green fields - Sakshi

పచ్చని పంట పొలాల మీదుగా రోడ్డుకు సర్వేలు

భూ యజమానులకు తెలీకుండా సర్వే పేరుతో కొలతలు

వెన్నాదేవి వద్ద భూయజమానుల ఆందోళన

ప్రభుత్వ డొంక భూమి వదిలేసి విలువైన భూములు కావాలా!?

ప్రభుత్వం భూసేకరణ నిలిపేయకుంటే ఆత్మహత్యలేనని హెచ్చరిక

సత్తెనపల్లి : పచ్చని పంట పొలాల మీదుగా బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి గుంటూరు జిల్లా అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికి మూడు సర్వేలు చేపట్టిన అధికారులు సత్తెనపల్లి మండలం కంకణాపల్లి పంచాయతీ శివారు గ్రామమైన వెన్నాదేవి వద్ద స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు వ్యక్తిగత అంగరక్షకుని పేరుతో ఉన్న భూమిని బైపాస్‌ నుంచి తప్పించేందుకే ఇళ్లు, పచ్చని పంట పొలాల మీదుగా బైపాస్‌ రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. సత్తెనపల్లి మండలం కంకణాపల్లి పంచాయతీ శివారు గ్రామమైన వెన్నాదేవిలో గుంటూరు–మాచర్ల ప్రధాన రహదారి పక్కన షేడ్‌నెట్‌లు ఏర్పాటుచేసుకుని ఆకు కూరలు, కాయగూరలు, వివిధ రకాల పంటలు పండిస్తూ పలువురు రైతులు జీవిస్తున్నారు. బైపాస్‌ పేరుతో విలువైన మూడు పంటలు పండే సుమారు 30 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు కొలతలు వేసి పుల్లలు పాతారు.

బైపాస్‌లో తమ భూములు పోతున్నాయని తెలుసుకున్న రైతులంతా శుక్రవారం తమ పంట భూముల వద్దకు చేరుకుని ఆవేదన వ్యక్తంచేశారు. ఎకరం రూ.2 కోట్ల విలువైన భూముల మీదుగా బైపాస్‌ రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టడం దారుణమన్నారు. 60 మీటర్ల పొడవునా 200 మీటర్ల విలువైన పంట భూమి తీసుకుంటే ఇక మిగిలేది ఏమిటంటూ ఆవేదన చెందారు. ఈ భూమికి కొద్ది దూరంలో ప్రభుత్వ డొంక ఉందని, ఆ భూమిని సేకరించకుండా రాజకీయ కుట్ర చేస్తూ కేవలం కోడెల శివప్రసాదరావు భూములకు నష్టం జరగకుండా చూసేందుకు రైతులను ఇబ్బందులు పెట్టడం తగదన్నారు. సాగర్‌ కాలువపై ఆధారపడకుండా బోరు బావుల ద్వారానే ఏడాదిలో మూడు పంటలను పండించుకుంటూ జీవిస్తున్నామని పేర్కొన్నారు. భూ యజమానులమైన తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా సర్వేచేసి ఉన్న పళంగా పుల్లలు పాతారని, ఇలాంటి దారుణం మరెక్కడా ఉండదని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే ఈ చర్యలను ఉపసంహరించుకుని ప్రభుత్వ భూమిని సేకరించాలని.. లేకుంటే ఆత్మహత్యలకు పాల్పడాల్సి ఉంటుందని భూయజమానులు, నివాస గృహాల యజమానులు హెచ్చరించారు.
భూసేకరణ చేపట్టని ప్రభుత్వ డొంక 

రాజకీయ కుట్రతోనే భూసేకరణ 
నాకు ఇక్కడ ఐదెకరాల భూమి ఉంది. బైపాస్‌ కోసం చేపట్టిన భూసేకరణలో రెండెకరాలు కోల్పోతా. మాకు కనీస సమాచారం ఇవ్వలేదు. ఏడాది పొడవునా పంటలు పండే భూముల మీదుగా రోడ్లు వేయడం రాజకీయ కుట్రే. తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. 
    – గొడుగుల సుబ్బారావు, రైతు, వెన్నాదేవి

సాగర్‌ జలాలతో పనిలేకుండా పంటలు 
సాగర్‌ కాలువల నీటితో పనిలేకుండా బావుల్లో నీటిని వినియోగించుకుని ఏడాది పొడవునా పంటలు పండించుకుంటున్నాం. కూలీలకు కూడా ఉపాధి కల్పిస్తున్నాం. బైపాస్‌ పేరుతో మాపై కక్ష సాధింపు చర్యలకు దిగడం తక్షణమే మానుకోవాలి.     
    – శ్రీకాంత్, రైతు, వెన్నాదేవి

డొంకను తీసుకుంటే ఖర్చు తగ్గుతుంది
3 పంటలు పండే భూములను బైపాస్‌ కింద తీసుకుంటే ఆధారం కోల్పోతాం. మా భూమిని కౌలుకిస్తే ఏడాదికి రూ.50వేలు ఇస్తారు. అంతటి విలువైన భూములను రోడ్డు పేరుతో తీసుకోవటం దారుణం. వృథాగా ఉన్న ప్రభుత్వ డొంకను తీసుకుంటే ప్రభుత్వానికి ఖర్చు కూడా తగ్గుతుంది.  
– సాంబశివరావు, రైతు, వెన్నాదేవి

జీవనాధారం కోల్పోతాం
షేడ్‌నెట్‌లో మిరప మొక్కల పెంపకం చేపడతాను. నాకు 4.70 ఎకరాల భూమి ఉంది. దీనిలో 0.70 ఎకరాలు బైపాస్‌ పేరుతో కొలతలు వేసి పుల్లలు పాతారు. ఈ భూమిని రోడ్డు కింద తీసుకుంటే జీవనాధారం కోల్పోతాం. ప్రభుత్వ భూమి వినియోగించుకుని మాకు ఇబ్బందులు లేకుండా చూడాలి.
– తోటకూర అనిల్‌కుమార్, రైతు, వెన్నాదేవి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top