చెప్పులో జీఎస్టీ రాయి!

GST effect on Footwear industry - Sakshi

     రెండు రకాల పన్నులతో నష్టపోతున్న పాదరక్షల పరిశ్రమ

     జీఎస్టీ తర్వాత రూ.500–1,000 శ్రేణిలో తగ్గిన మోడల్స్‌

     18 శాతం పన్నును 12 శాతానికి తగ్గించాలంటున్న పరిశ్రమ

సాక్షి, అమరావతి : విజయవాడలో కొత్తగా ఉద్యోగంలో చేరిన శ్రీకృష్ణ చెప్పులు కొనుక్కుందామని వెళ్లాడు. ఎన్ని షాపులు తిరిగినా అతనికి ఉంటే రూ.500లోపు ధరలో లభిస్తున్నాయి లేకపోతే వెయ్యి దాటితే కానీ దొరకడంలేదు. దీనితో విసుగొచ్చిన అతను.. ఏమిటయ్యా ఉంటే తక్కువ ధరలో ఉంటున్నాయి లేకపోతే అధిక ధరలో ఉంటున్నాయి.. మాలాంటి మధ్య తరగతి వాళ్ల బడ్జెట్‌లో మోడల్స్‌ లేవేంటి అని ప్రశ్నిస్తే షాపు వారి నుంచి ఇదంతా జీఎస్‌టీ మహిమ అన్న సమాధానం వచ్చింది. చెప్పుల మోడళ్లకు జీఎస్‌టీకి సంబంధం ఏమిటో శ్రీకృష్ణకు అర్థంకాలేదు.. ఇదీ ఇప్పుడు జీఎస్‌టీ వచ్చిన తర్వాత దేశంలో పాదరక్షల పరిశ్రమ ఎదుర్కొంటున్న విచిత్ర పరిస్థితి. ఎక్కడా లేని విధంగా జీఎస్‌టీలో రెండు రకాల పన్నులను విధించడంతో రూ.500లోపు, లేదా రూ.1,000పైన మోడళ్లే ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి.

జీఎస్‌టీలో విధిస్తున్న 5%, 18% పన్నులే ఇందుకు కారణం. రూ.500లోపు ధర ఉంటే కేవలం 5 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అదే రూ.500 దాటితే ఏకంగా 18 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు.. రూ.500 పెట్టి చెప్పుల జత కొంటే జీఎస్‌టీ రూ.25 చెల్లించాలి. అదే రూ.501 అయితే.. పన్ను ఏకంగా రూ.90 జీఎస్‌టీ చెల్లించాలి. ఒక్క రూపాయి పెరిగితే ఏకంగా రూ.65పన్ను అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు పరిశ్రమకు పెద్ద గుదిబండగా మారింది.

తగ్గిన మోడళ్లు
చెప్పుల ధర రూ.500 దాటిన తర్వాత ఒక్కసారిగా పన్ను మూడు రెట్లు పెరగడంతో పాదరక్షల తయారీ పరిశ్రమ రూ.500–1,000 రేంజ్‌లో చెప్పుల తయారీని దాదాపుగా నిలిపివేశాయి. ఇప్పటివరకు రూ.600, 700 శ్రేణిలో ఉన్న పాదరక్షలను పన్నుల భారం నుంచి తప్పించుకోవడానికి రిటైలర్లకు కమీషన్లు తగ్గించి రూ.500కు తీసుకొచ్చాయని, అదే విధంగా మిగిలిన మోడళ్లను రూ.1,000 శ్రేణికి పెంచేశాయని రిటైల్‌ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో జరుగుతున్న పాదరక్షల అమ్మకాల్లో 61శాతం రూ.500 ధరలోపే ఉండగా, రూ.501–1000 శ్రేణి అమ్మకాలు 20శాతంగా ఉన్నాయి. అదే, జీఎస్‌టీ రాకముందు రూ.500లోపు అమ్మకాలు 40–50 శాతం ఉండగా, రూ.500 నుంచి రూ.1,000లోపు అమ్మకాలు 30–40 శాతం ఉండేవి.

ఇప్పుడు జీఎస్‌టీ వచ్చిన తర్వాత ఈ శ్రేణి 20 శాతానికి పడిపోయిందని, రానున్న కాలంలో ఇది మరింత తగ్గే అవకాశం ఉందని రిటైల్‌ సంస్థలు భావిస్తున్నాయి. కానీ, విలువ పరంగా చూస్తే మాత్రం అమ్మకాల్లో రూ.1,000 దాటిన వాటి వాటా 50 శాతంగా ఉంటే రూ.500లోపు పాదరక్షల అమ్మకాల ద్వారా 27 శాతం ఆదాయం మాత్రమే వస్తోంది. పన్నుల్లో ఇంత భారీ వ్యత్యాసం ఉండటంవల్ల మధ్యతరగతి ప్రజలకు గుదిబండగా మారిందని, రెండు పన్నులను తీసేసి మొత్తం తక్కువ స్థాయిలో ఒకే పన్ను విధానం అమలుచేస్తే బాగుంటుందని సామాన్యులు సూచిస్తున్నారు.

12 శాతం శ్లాబుల్లోకి తీసుకురావాలి
గతంలో లెదర్, నాన్‌ లెదర్‌ అని రెండు రకాల పన్నులు ఉండేవి. జీఎస్‌టీ వచ్చిన తర్వాత దీన్ని తొలిగించి ధర రూ.500లోపు అయితే 5 శాతం, రూ.500 దాటితే 18 శాతం పన్నును విధించారు. దీనివల్ల పరిశ్రమ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలా పన్నును ఒకేసారి భారీగా పెంచడంవల్ల అవకతవకలకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది. దీన్ని తొలగించాలంటే ఏకపన్ను విధానంలో 12 శాతం పన్ను విధిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. 
– బీఎస్‌ కోటేశ్వరరావు, ఎండీ, ప్రాఫిట్‌ షూ కంపెనీ లిమిటడ్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top