తవ్వు.. తరలించు

Gravel Thievs in Chittoor - Sakshi

శోత్రియ భూముల్లో గ్రావెల్‌ దొంగలు

రాత్రిళ్లు యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు

మామూళ్ల మత్తులో పోలీస్, రెవెన్యూ యంత్రాంగం

కోట్లు గడిస్తున్న అక్రమార్కులు

వరదయ్యపాళెంలోని శోత్రియ భూములకు భద్రత కరువైంది. ఓవైపు ఇంటి స్థలాల పేరుతో పుట్టుకొస్తున్న అక్రమ గుడిసెలు.. మరోవైపు కబ్జాకు గురై సాగు చేస్తున్న భూములతో ఇప్పటికే ఈ ప్రాంతం రూపు కోల్పోతోంది. తాజాగా వీరికి గ్రావెల్‌ దొంగలు తోడవడంతో శోత్రియ భూముల అస్థిత్వానికే ముప్పు ఏర్పడింది.

వరదయ్యపాళెం: మండల పరిధిలోని చిన్న పాండూరు సమీపంలో 1,060 ఎకరాల శోత్రియ భూములున్నాయి. ఈ భూములకు సంబంధించి ఆటు ప్రభుత్వానికి, ఇటు ప్రైవేటు వ్యక్తులకు మధ్య కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అదునుగా భావించిన గ్రావెల్‌ మాఫియా గడిచిన కొద్దిరోజులుగా రాత్రి వేళల్లో అక్రమంగా తవ్వకాలు జరిపి శ్రీసిటీ పరిశ్రమలకు గ్రావెల్‌ తరలించి లక్షల రూపాయిలు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఈ భూముల్లో భారీ  గుంతలు ఏర్పడ్డాయి.  ఇంత జరుగుతున్నా.. రెవెన్యూ అధికారుల మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

చిన్న పాండూరు చెరువు నుంచీ..
శోత్రియ భూముల సమీపంలోని చిన్న పాం డూరు సాగునీటి చెరువు నుంచి కూడా పెద్దఎత్తున  గ్రావెల్‌ తరలిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ను బూచిగా చూపి రాత్రికి రాత్రే చెరువు మట్టిని కొల్లగొడుతున్నారు. ఈ క్రమాలను అడ్డుకోవాల్సిన ఇరిగేషన్‌ అధికారులు అటువైపు కూడా కన్నెత్తి చూడడం లేదు. ఇటీవల చిన్న పాండూరు చెరువుకు సంబంధించి నీరు–చెట్టు ద్వారా రూ. 35 లక్షలతో పనులు చేపట్టారు. ఆసమయంలో పెద్దఎత్తున మట్టిని తరలించిన స్థానిక టీడీపీ నేతలు లక్షల రూపాయిలు జేబులు నింపుకున్నారు. అయితే మళ్లీ అదే చెరువు నుంచి యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

గ్రావెల్‌కి భలే గిరాకీ
అటు శ్రీసిటీ, ఇటు హీరో, అపోలో పరిశ్రమలు ఏర్పాటు కావడం, వీటికితోడు కొత్తగా పుట్టుకొస్తున్న రియల్‌ వెంచర్ల కారణంగా స్థానికంగా గ్రావెల్‌ మట్టికి గిరాకీ ఏర్పడింది. దీంతో ఈ వ్యాపారాన్ని ఎంచుకున్న అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు అక్రమ లీజులతో చెరువులలో ఎంచక్కా మట్టి వ్యాపారాన్ని దర్జాగా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో 1000 ఎకరాల వీస్తీర్ణంలో ఖాళీగా ఉన్న శోత్రియ భూములపై అక్రమార్కుల కన్నుపడింది. దీంతో ఎలాంటి లీజులు, అనుమతులు పొందకనే అధికారుల అండతో రాత్రికిరాత్రే  మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక టిప్పర్‌ లారీ మట్టి రూ.10వేలకుపైగా రేటు పలకడంతో అధికారులకు సైతం పెద్ద మొత్తంలో ముడుపులు అందుతున్నట్లు తెలిసింది.

ఇకపై మేమూ మట్టి తరలిస్తాం..
సంబంధంలేని వ్యక్తులు యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరుపుతున్న నేపథ్యంలో.. తమ అనుభవంలోని శోత్రియ భూములలో తామూ.. ఇకపై మట్టితరలిస్తామని అనుభవదారులు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించకుంటే.. ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం..
శోత్రియ భూముల్లో గ్రావెల్‌ తవ్వకాలపై స్థానికుల నుంచి మాకు ఫిర్యాదు అందింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తవ్వకాలు జరిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నిబంధనలను ఉల్లంఘిస్తే.. ఎంతటివారినైనా వదిలేది లేదు.    – వెంకటరమణ,    తహసీల్దార్, వరదయ్యపాళెం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top