టూరిస్ట్‌ హబ్‌ కానున్న ప్రకాశం

Government Is Focusing On Development Of Prakasam Tourism - Sakshi

జిల్లాలో తొలి విడతగా మూడు ప్రాంతాల ఎంపిక

గుండ్లకమ్మలో షికారు కోసం మరిన్ని బోట్లు

అన్నంగి కొండవీుద ఒంగోలు గిత్త ప్రతిమ

కొత్తపట్నం బీచ్‌లో మెరుగైన వసతులు

కసరత్తు చేస్తున్న జిల్లా యంత్రాంగం 

సాక్షి, ఒంగోలు మెట్రో: ఎన్నో చారిత్రక, సాంస్కృతిక విశిష్టతలున్న జిల్లా పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం అసలు పట్టించుకోని పర్యాటక విభాగాన్ని తొలి ఏడాదిలోనే పట్టించుకుని తొలి విడత మూడు ప్రాంతాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. విడతల వారీగా జిల్లాలోని అన్ని చారిత్రక, సాంస్కృతిక విశిష్టతలను గుర్తించి అభివృద్ధి చేసి జిల్లాను టూరిస్ట్‌ హబ్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. 

మూడు ప్రాంతాల ఎంపిక..
జిల్లాలో తొలి విడతగా 2019–20 వార్షిక సంవత్సరానికి గాను మూడు ప్రాంతాలను పర్యాటక అభివృద్ధి కోసం ఎంపిక చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రాంతం, దాని సమీపంలోని అన్నంగి ప్రాంతంతో పాటు కొత్తపట్నం సముద్రతీరాన్ని కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సర్వే శాఖ అధికారులను సర్వే చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ పోల భాస్కర్‌ ఆదేశించారు. అయితే, ఈ మూడు ప్రాంతాలనూ ప్రభుత్వ ప్రవేటు భాగస్వామ్యంతో ప్రత్యేక కన్సల్టెంట్స్‌తో అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద బోటు షికారు ఇప్పటికే ఉన్నప్పటికీ అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు  చేపడుతున్నారు. తద్వారా పర్యాటకులను ఆకర్షించేందుకు, ఆ ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు త్వరలో చర్యలు చేపట్టనున్నారు. ఇక గుండ్లకమ్మలో బోటు షికారు కోసం బోట్‌ల సంఖ్య కూడా పెంచనున్నారు. అన్నంగి ప్రాంతంలో 13 ఎకరాలలో ప్రత్యేకంగా పర్యాటక శాఖ సహకారంతో అభివృద్ధి చేసి అన్నంగి కొండ మీద ఒంగోలు గిత్త పెద్ద ప్రతిమను ఏర్పాటు చేసి ఈ ప్రాంత విశిష్టతను పర్యాటకులకు తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి సర్వే చేసి సూచనలు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

కొత్తపట్నం బీచ్‌లో వసతులు..
పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఎంపిక చేసిన మూడు ప్రాంతాల్లో కొత్తపట్నం బీచ్‌ ఒకటి. సందర్శకులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించి తీర ప్రాంతం పర్యాటకులకు ఆహ్లాదం కలిగేట్టు తీర్చిదిద్దనున్నారు.కలెక్టర్‌ సూచనలను అనుసరించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇలా తొలి విడతగా ఈ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసి సందర్శకుల సంఖ్య పెంచటం లక్ష్యంగా తద్వారా పర్యాటక ప్రాంతంగా జిల్లాను తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top