అమ్మకు వందనం.. గురువుకు ఎగనామం!

Government Delayed on Anniversary Funds - Sakshi

వార్షికోత్సవ వనరులు ఇవ్వని ప్రభుత్వ యంత్రాంగం

ఉపాధ్యాయ సిబ్బందికి గుదిబండగా పథకాలు

పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తినడానికి తిండి లేదు, మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట్టు ఉంది ప్రభుత్వ తీరు. విద్యారంగ ఉన్నతికి, పాఠశాలల అభివృద్ధికి కావలసిన నిధులు విడుదల చేయడంలో ఏ మాత్రం స్పందించని ప్రభుత్వం అమ్మకు వందనం, పాఠశాలల వార్షికోత్సవాలు అన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి నిర్వహణకు ఎటువంటి బడ్జెట్‌ కేటాయించకపోవడం, పాఠశాలల అభివృద్ధికి మంజూరు చేసిన నిధుల విడుదలలో కోత పెట్టడంతో ప్రభుత్వ విద్యారంగంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తోందని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

జిల్లాలో పాఠశాలల వివరాలివీ
జిల్లాలో ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు మొత్తం 3,297 ఉన్నాయి. వాటిలో 2,550 ప్రాథమిక, 251 ప్రాథమికోన్నత, 496 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో అమ్మకు వందనం కార్యక్రమం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు ప్రతీ పాఠశాలలో రూ. 2,500 నిధులతో విద్యార్థుల తల్లులకు పూలదండలు వేసి సత్కరించి, విద్యార్థుల చేత వారి మాతృమూర్తులకు పాదాభివందనాలు చేయించి ఆశీర్వచనాలు ఇప్పించాలని ఆదేశాల్లో పేర్కొంది. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేయాలని ఆదేశాలు జారీచేసినా  కేవలం 545 పాఠశాలలకు మాత్రమే రూ.2,500 చొప్పున రూ.13.62 లక్షల  బడ్జెట్‌ విడుదల చేసింది. అయితే కొన్ని పాఠశాలలకు సంబంధించిన మొత్తాన్ని మండల విద్యాశాఖాధికారి ఖాతాకు వేయడంతో ఆయా పాఠశాలలకు వారి నుంచి ఆ మొత్తం ఇంకా సంబంధిత పాఠశాలలకు అందలేదు. మిగిలిన పాఠశాలలు మాత్రం వాటి స్కూల్‌ గ్రాంటుల్లోని నిధులను ఉపయోగించుకోవాలని సూచించింది. దీంతో మిగిలిన 2,752 పాఠశాలలకు సంబంధించి ఈ కార్యక్రమ నిర్వహణకు రూ.68.80 లక్షలు ఖర్చు అయింది. ఆ భారమంతా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై పడిందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

వార్షికోత్సవాలకూ చిల్లిగవ్వ ఇవ్వలేదు..
ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్‌ విద్యా సంస్థల తరహాలో వార్షికోత్సవాలు నిర్వహించి విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించాలనేది ప్రభుత్వ యోచన.  ఈ మేరకు ప్రతీ పాఠశాలలో విధిగా వార్షికోత్సవం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకూ ఖర్చుపెట్టి ఈ కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల్లో వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం ఎలాగూ కొంత మొత్తాన్ని ప్రకటించింది కాబట్టి విద్యార్థులను ఉత్సాహపరచడానికి వారికి క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడానికి స్థానిక దాతల నుంచి కూడా కొంత మొత్తాన్ని విరాళాల రూపంలో సేకరించి ఆ తంతు ముగించారు. కార్యక్రమం ముగిసి నెల రోజులు గడిచినా దీనికి ఖర్చుపెట్టిన మొత్తానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమ జేబుల్లో డబ్బులు వేసుకోవాల్సి వచ్చిందనేది ఉపాధ్యాయ సంఘాల వాదన. ప్రభుత్వం ఎటువంటి నిధులు ఇవ్వకుండా ఇటువంటి కార్యక్రమాలను బలవంతంగా రుద్దడంతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని చెబుతున్నారు.

కొన్ని పాఠశాలలకే నిధులా!
అమ్మకు వందనం కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని ఆదేశాలిచ్చిన విద్యాశాఖాధికారులు కొన్ని పాఠశాలలకే నిధులు విడుదల చేయడంలో ఆంతర్యమేమిటి? మూడు వేలకు పైగా పాఠశాలలుంటే కేవలం 545 పాఠశాలలకు మాత్రమే నిధులిచ్చారు. అవి ఏ ప్రాతిపదికన ఇచ్చారో స్పష్టం చేయాలి. వాటిలో కూడా కొన్ని పాఠశాలలకు ఇప్పటివరకూ నిధులు చేరలేదు. వెంటనే ఆ నిధులు సంబంధిత పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకోవాలి.–గుగ్గులోతు కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top