ఇదో జనరిక్‌ దోపిడీ

This is a Generic robbery - Sakshi

బ్రాండెడ్‌ జనరిక్‌ మందులు కూడా బ్రాండెడ్‌ ధరలకే

ఎంఆర్‌పీ పేరుతో రూ.150 విలువైన ఇంజక్షన్‌ రూ.1,800కు

కృత్రిమ మోకాలి చిప్పల ధర తగ్గినా ఆపరేషన్‌కు రూ.లక్షన్నర.. 

ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీ పర్వం

కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన సావిత్రి లివర్‌ సంబంధిత వ్యాధితో బాధపడుతూ విజయవాడలోని నక్కలరోడ్డులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈమె ఐసీయూలో మూడు రోజులు ఉన్నారు. ఈమెకు మెరీపెనం యాంటీబయోటిక్‌ ఇంజెక్షన్‌ వాడారు. ఇది బ్రాండెడ్‌ జనరిక్‌ మందు. దీని వాస్తవ ధర రూ.150. ఎంఆర్‌పీ మాత్రం రూ.2 వేలు ఉంటుంది. ఈ మందును సావిత్రికి రూ.1800కు విక్రయించి బిల్లువేశారు.

సాక్షి, అమరావతి: మందులు తయారు చేసే కంపెనీలు.. వాటిని అమ్మే డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్‌ వ్యాపారులు అందరూ లాభాలు చూసుకుని సేఫ్‌గా బయటపడుతున్నారు. చివరి లబ్ధిదారుడు, బాధితుడు అయిన రోగికి మాత్రం దిమ్మ తిరిగిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండెడ్‌–జనరిక్‌ అనే మాయా ప్రపంచంలో ఏది అమ్ముతున్నారో, దేనికెంత వసూలు చేస్తున్నారో తెలియని సామాన్య రోగి.. జబ్బు నయం కావాలనే ఆశతో సర్వశక్తులూ ఒడ్డి మందులకు చెల్లిస్తున్నాడు. ఒళ్లు గుల్ల చేసుకుని, ఇళ్లమ్ముకుని, అప్పులు చేసుకుని ఆస్పత్రి నుంచి బతుకు జీవుడా అంటూ బయటపడుతున్న పరిస్థితి కలచివేస్తోంది. మందుల మాఫియా కోరల్లో విలవిలలాడుతున్న సామాన్య రోగుల పరిస్థితి రోజుకో రకంగా మారుతోంది. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో జరుగుతున్న ఈ బ్రాండెడ్‌ జనరిక్‌ మాఫియా బారిన లక్షలాది మంది పేద రోగులు నిలువెల్లా మోసపోతున్నారు. ఈ మోసాన్ని అరికట్టాల్సిన అధికారులు మాత్రం ఎక్కడా కానరావడంలేదు.  

బ్రాండెడ్‌ కంపెనీలు జనరిక్‌ బాటలో 
చాలా మల్టీ నేషనల్‌ ఫార్మాస్యుటికల్‌ కంపెనీలు బ్రాండెడ్‌ జనరిక్‌ పేరుతో మందులు తయారు చేస్తున్నాయి. వీటిపై ఎంఆర్‌పీ ధరలు ఇప్పటికీ రివైజ్‌ (సవరణ) చెయ్యలేదు. ఉదాహరణకు సెఫిపారజోన్‌ ఇంజక్షన్‌ ధర ఎంఆర్‌పీ రూ.370 ఉంటుంది. కానీ దీని జనరిక్‌ ధర 30 రూపాయలే. ఇలాంటి వందలాది రకాల బ్రాండెడ్‌ జనరిక్‌ ధరలు ప్రైవేటు ఆస్పత్రుల్లో బ్రాండెడ్‌ రేట్లకే అమ్ముతున్నారు. రోగికి ఏది బ్రాండెడో, ఏది జనరిక్‌ మందులో అర్థం కాక ఆస్పత్రులు వేస్తున్న బిల్లులు విధిలేని పరిస్థితుల్లో చెల్లిస్తున్నారు. ఇలా రోజూ వేలాది మంది రోగుల నుంచి కోట్లకు కోట్లు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది.

మోకాలి చిప్పల రేట్లు తగ్గినా
కొన్ని నెలల క్రితం ఎన్‌పీపీఏ (నేషనల్‌ ఫార్మాస్యుటిక్‌ ప్రైసింగ్‌ అథారిటీ) దేశంలో ఏ కంపెనీ అయినా సరే మోకాలిచిప్పను రూ.36 వేలకు మించి అమ్మకూడదని నిబంధన విధించి, ఈ ఇంప్లాంట్స్‌ను ధరల నియంత్రణలోకి తెచ్చింది. గుండెకు వేసే స్టెంట్‌ను కూడా ధరల నియంత్రణలోకి తెచ్చింది. మోకాలి చిప్పల ధరలు తగ్గక మునుపు ఒక్కో కాలికి మోకాలి చిప్ప మార్చాలంటే లక్షన్నర నుంచి రూ.1.70 లక్షల వరకూ వసూలు చేసేవారు. ఇప్పుడు అంతే వసూలు చేస్తున్నారు. అదేమంటే ప్రొసీజర్‌ కాస్ట్, నర్సింగ్‌ కాస్ట్, థియేటర్‌ చార్జీల పేరిట బిల్లు వేస్తున్నారు. గుండెకు వేసే స్టెంట్‌ల ధరలు కూడా ధరల నియంత్రణలోకి వచ్చినా అవి వేయించుకునే రోగులకు మాత్రం బిల్లులు లక్షల్లోనే వేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top