సబ్సిడీకి ‘సున్నం’

సబ్సిడీకి ‘సున్నం’ - Sakshi


పలు జిల్లాల్లో 50% కూడా పూర్తికాని ఆధార్ నమోదు, ఖాతాల అనుసంధానం

గడువు పెంపునకు పెట్రోలియం శాఖ ససేమిరా   

ఆధార్ లేకుంటే సబ్సిడీ రద్దుకు ఆదేశం

సిలిండర్ ధర రూ. 1,327.50  

వినియోగదారులపై నెలకు రూ. 300 కోట్లకు పైగా భారం


 

 సాక్షి, హైదరాబాద్: ఆధార్ లేదనే కారణంతో ప్రజలకు ప్రభుత్వ పథకాల ద్వారా కలిగే ప్రయోజనాలను నిలిపివేయరాదని, ఆధార్ తప్పక నమోదు చేసుకోవాలని ఒత్తిడి చేయరాదని సాక్షాత్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినా.. కేంద్రం ఆ ఆదేశాలను తుంగలో తొక్కుతోంది. ఆధార్ నమోదు తప్పనిసరికాదని, ఐచ్ఛికమని సుప్రీంకోర్టుకు రాతపూర్వకంగా తెలిపిన కేంద్ర సర్కారు.. ఆచరణలో మాత్రం ఆధార్ లేని వారికి వంటగ్యాస్ సబ్సిడీని రద్దు చేయాలంటూ ఆదేశాలు జారీ చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో అమలు చేస్తున్న నగదు బదిలీ - డీబీటీ పథకాన్ని ఈ నెల 1 నుంచి మరో ఏడు జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించింది.

 

 దీంతో.. ఆదిలాబాద్, వైఎస్సార్, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆధార్ అనుసంధానం కానివారికి జనవరి 1 నుంచి వంట గ్యాస్ సబ్సిడీ రద్దయింది. వీరి నుంచి సిలిండర్‌కు రూ. 1,327.50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ జిల్లాల్లోని వంటగ్యాస్ వినియోగదారులకు ఆధార్ విశిష్ట సంఖ్య నమోదు, బ్యాంకు అకౌంట్లకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ కనీసం 50 శాతం కూడా పూర్తికాలేదు. దీంతో వినియోగదారులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వంటగ్యాస్ సబ్సిడీ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ కాలరాస్తోంది.

 

 కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఆధార్ లేని వినియోగదారులకు సబ్సిడీని రద్దుచేసింది. ఇలా చేయటం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే. దీనిపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులను సంప్రదిస్తే.. ఆధార్ లేనివారికి కూడా గ్యాస్ సబ్సిడీ ఇవ్వాలనే అంశంపై తమకు పెట్రోలియం శాఖ నుంచి ఆదేశాలు రాలేదని చెప్తున్నారు.

 

 గడువడిగినా ఇవ్వలేదు: ఆధార్ అనుసంధానానికి మరికొంత కాలం గడువు ఇవ్వాలని, అప్పటివరకూ ఆధార్‌తో నిమిత్తం లేకుండా వంట గ్యాస్ వినియోగదారులందరికీ సబ్సిడీ వర్తింపజేయాలని ఆయా జిల్లాల అధికారులు, వంటగ్యాస్ ఏజెన్సీల డీలర్లు చేసిన విజ్ఞప్తిని కేంద్ర పెట్రోలియంశాఖ పట్టించుకోలేదు. బ్యాంకు అకౌంట్లతో ఆధార్ అనుసంధానం కానివారికి వంటగ్యాస్ సబ్సిడీని రద్దు చేయాలంటూ వంటగ్యాస్ ఏజెన్సీల డీలర్లకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.

 

 నెలకు అదనపు భారం రూ. 306 కోట్లు

 ఆధార్ అనుసంధానం కానందున 12 జిల్లాల్లో 36,23,602 మంది వంటగ్యాస్ వినియోగదారులు ఒక్కో సిలిండర్‌పై రూ. 845 చొప్పున సబ్సిడీ కోల్పోతున్నారు. నెలకు ఒక్కో వినియోగదారుడు ఒక సిలిండర్ చొప్పున వినియోగించుకున్నట్లు లెక్కిస్తే.. నెలసరి వీరిపై రూ. 306.19 కోట్ల అదనపు భారం పడుతోంది. భవిష్యత్తులో వీరు ఆధార్ నమోదు చేసుకుని బ్యాంకు అకౌంట్లతో అనుసంధానం చేసుకున్నా ఆ తర్వాతే సబ్సిడీ వర్తిస్తుందని, ఇప్పుడు కొనుగోలు చేసిన సిలిండర్లకు సబ్సిడీ రీయింబర్స్‌మెంట్ ఉండదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెప్తున్నాయి.

 

 మొదటి విడతలోనే 12 లక్షల మందికి దెబ్బ

 మొదటి విడత డీబీటీ అమల్లో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆధార్ అనుసంధానం కానివారికి రెండు మూడు నెలల కిందటి నుంచే వంటగ్యాస్ సబ్సిడీ రద్దయింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే తొమ్మిది లక్షల మందికిపైగా వినియోగదారులు సబ్సిడీ కోల్పోతున్నారు. మిగిలిన మూడు జిల్లాల్లో సబ్సిడీ కోల్పోతున్న వారి సంఖ్య మూడున్నర లక్షలకుపైగా ఉంది. అంటే మొదటి విడత డీబీటీ అమలు వల్ల ఐదు జిల్లాల్లో కలసి దాదాపు పన్నెండున్నర లక్షల మందికిపైగా వంటగ్యాస్ సబ్సిడీని కోల్పోతున్నారు.

 

 రెండో విడతలో 23 లక్షల మందికి సున్నా

 తాజాగా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ జనవరి ఒకటో తేదీ నుంచి మరో ఏడు జిల్లాల్లో డీబీటీని పూర్తిస్థాయిలో అమల్లోకి తేవడంతో మరో 23.46 లక్షలమంది వినియోగదారులు వంటగ్యాస్ సబ్సిడీ కోల్పోతున్నారు. అంటే.. మొత్తం 12 జిల్లాల్లో కలిపి 36 లక్షల మంది వినియోగదారులు సబ్సిడీకి దూరమై.. గ్యాస్ భారాన్ని పూర్తిగా భరించాల్సి వస్తోంది. దీంతో డీబీటీ అంటే ప్రత్యక్ష లబ్ధి బదిలీ కాదని, ప్రజలపై ప్రత్యక్ష భారం బదిలీలా తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top