గజ్వేల్-సింగూర్ మంచినీటి పథకం ప్రతిపాదనలకు అడ్డంకులెదురవుతున్నాయి.
	గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్-సింగూర్ మంచినీటి పథకం ప్రతిపాదనలకు అడ్డంకులెదురవుతున్నాయి. ఈ ప్రతిపాదనలకు మరిన్ని సవరణలు చేసి తిరిగి సమర్పించాలని ప్రజారోగ్యశాఖ చీఫ్ ఇంజినీర్ ఈ ఫైల్‌ను ఎన్సీపీఈ (నేషనల్ కన్సల్టెన్సీ ఫర్ ప్రాజెక్ట్ ఎంటర్‌ప్రీమియర్)కు పంపారు. ప్రస్తుతం ఆ కన్సల్టెన్సీ మార్పులు, చేర్పులు చేపట్టే పనిలో ఉంది. అంచనా వ్యయాన్ని రూ.234 కోట్ల నుంచి రూ.197 కోట్లకు కుదించారు. సవరణలు పూర్తయిన తర్వాత సీఈ ద్వారా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సమర్పించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియంతా పూర్తయిన తర్వాతే నిధుల మంజూరయ్యే అవకాశం. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు  ఈ వ్యవహారంపై దృష్టి సారిస్తే పథకం వేగంగా మంజూరయ్యే అవకాశముందని స్థానికులు నగర పంచాయతీకి వరంగా మారునున్న గజ్వేల్-సింగూర్ పథకానికి ప్రతిపాదనల దశలోనే అడ్డంకులెదురవుతున్నాయి. పట్టణంలో మంచినీటి సమస్యను శాశ్వతంగా నిర్మూలించేందుకు గజ్వేల్‌కు మంజీరా నదిపై నిర్మించిన సింగూర్ ప్రాజెక్టు నుంచి 8.3 ఎల్‌ఎండీ నీటిని నిత్యం ఇక్కడికి తరలించే పథకానికి రూపకల్పన చేశారు.
	 
	 ఇందుకోసం అక్కడినుంచి పైప్‌లైన్, ఇతర 53 రకాల పనులను చేపట్టడానికి  రూ.234 కోట్లు అవసరమని తొలుత ప్రతిపాదించారు. కానీ ప్రజారోగ్యశాఖ ఉన్నతాధికారుల సూచన మేరకు మార్పులు చేసి అంచనా వ్యయం ప్రతిపాదనలను రూ.211 కోట్లకు కుదించి ప్రతిపాదనలు అందజేయగా మార్పులు చేయాలని సీఈ ఆదేశించారు. ఈ మేరకు అంచనా వ్యయాన్ని మరింతగా తగ్గించి రూ.197 కోట్లతో ఇటీవల సీఈకి సమర్పించారు. దీనిపై మరోసారి మార్పులు జరగాలని ఆయన తాజాగా ఆదేశించగా ప్రస్తుతం ఈ ఫైల్ ఎన్‌సీపీఈ వద్దకు చేరింది. ఆ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో మార్పులు, చేర్పులు జరగనున్నాయి. ఈ పథకం కింద చేపట్టబోయే పనులు, అంచనా వ్యయంపై సవరణలు జరిగే అవశాశమున్నది.
	 
	 అది పూర్తయిన తర్వాత ప్రజారోగ్య శాఖ సీఈ ద్వారా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సమర్పించే అవకాశముంది. ఈ ప్రక్రియంతా పూర్తయిన తర్వాతే నిధుల మంజూరుపై ఆశలు పెట్టుకునే అవకాశముంటుంది. ఇదంతా వేగంగా జరగాలంటే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా చొరవ చూపాల్సిన అవసరముంది. ఈ వ్యవహారంపై గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్‌ను వివరణ కోరగా గజ్వేల్-సింగూర్ పథకానికి ప్రజారోగ్య శాఖ చీఫ్ ఇంజినీర్ సవరణలు కోరిన మాట వాస్తమేనని ధ్రువీకరించారు. తొందర్లోనే సవరణలు పూర్తిచేసి ప్రతిపాదనలు సమర్పించి నిధులు రాబడతామన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
