
ప్రభుత్వ జూనియర్ కళాశాల
సాక్షి, విజయనగరం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి విద్యార్ధి ఉన్నత విద్యనభ్యసించాలన్న సంకల్పంతో రూపొందించిన కొత్త విద్యా విధానానికి విద్యార్థి లోకం ఆకర్షితులవుతోంది. ఒకప్పుడు ప్రభుత్వ విద్య అంటే చిన్న చూపు చూసేవారు సైతం ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం పోటీ పడుతున్నారు. ఇదే తరహాలో పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు 2019–20 విద్యా సంవత్సరంలో విపరీతమైన పోటీ నెలకొంది. ప్రభుత్వం కేటాయించిన సీట్లకు మూడింతల సంఖ్యలో విద్యార్థులకు ప్రవేశ అవకాశాలు కల్పించినప్పటికీ, కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కళాశాలలో సీట్లు నిండిపోయాయని ప్రిన్సిపల్ చెప్పాల్సి వస్తోంది.
2008లో కోలగట్ల హయాంలో ప్రారంభం
విజయనగరం జిల్లా కేంద్రం 1979లో ఆవిర్భవించినప్పటి నుంచి 2008 వరకు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవటం గమనార్హం. దీంతో వేలకు వేలు ఫీజులు చెల్లించి ప్రైవేటు కళాశాలల్లో విద్యనభ్యసించలేని నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యేవారు. ఈ నేపధ్యంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి 2008లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేయించారు. అప్పట్లో ప్రత్యేక భవనం లేకపోవటంతో మున్సిపల్ కస్పా ఉన్నత పాఠశాల ఆవరణలో తరగతులు నిర్వహించేవారు. రెండేళ్ల క్రితం నుంచి నూతన భవనంలో నిర్వహిస్తున్నారు.
ప్రవేశాలకు పోటీ
పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు విద్యా సంవత్సరంలో పోటీ పెరిగింది. సీట్లు నిండుకున్నాయని చెబుతున్నా విద్యార్థుల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. గతంలో పోల్చుకుంటే ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో ప్రవేశాలు కల్పించాం. కళాశాలలోని భవనాల సామర్థ్యానికి అనుగుణంగా చేర్పించుకున్నాం. కొత్తగా చేరదలచుకున్న వారికి సీట్లు లేవు.
– వీకేవీ కృష్ణారావు, ప్రిన్సిపల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, విజయనగరం.