
రైతన్నల రణభేరి
వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాననే హామీతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు రకరకాల మాటలు మాట్లాడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అన్నదాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
సీఎం బాబుపై కట్టలు తెంచుకున్న ఆగ్రహం
ఏపీ వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు
సాక్షి, యంత్రాంగం : వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాననే హామీతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు రకరకాల మాటలు మాట్లాడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అన్నదాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘నరకాసుర వధ’ పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు, డ్వాక్రా మహిళల్లో వెల్లువెత్తిన ఆగ్రహం మూడోరోజు మరింత ఉధృతంగా కనిపించింది. నరకాసురవధ చివరిరోజు ‘సీఎం డౌన్ డౌన్’ నినాదాలు గుంటూరు జిల్లాలో మార్మోగాయి. బాపట్ల రూరల్ మండలం వెదుళ్ళపల్లిలో రుణమాఫీ తీరుపై ఆగ్రహించిన మహిళల రాస్తారోకోతో రెండు గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రకాశం జిల్లాలో పలుచోట్ల నిరసనలు నిరసనలు వెల్లువెత్తాయి. పెద్దదోర్నాల, పెద్దారవీడు మండలాల్లో యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, మద్దిపాడులో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో భారీగా ఆందోళనలు నిర్వహించారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాలో రైతులు, డ్వాక్రా మహిళలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆందోళనలు హోరెత్తాయి. రాజమండ్రిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో న్యాయవాదులు ‘నమూనా ప్రజాకోర్టు’ నిర్వహించారు. చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలంలో చెన్నై, బెంగళూరు జాతీయ రహదారిపై ఆందోళనలు చేస్తున్న రైతులు, డ్వాక్రా మహిళలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కర్నూలు, వెఎస్సార్, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు.