పశుగ్రాసం కోసం పరుగులు | formers | Sakshi
Sakshi News home page

పశుగ్రాసం కోసం పరుగులు

Apr 23 2015 3:45 AM | Updated on Sep 3 2017 12:41 AM

పశుగ్రాసం కోసం మెట్ట ప్రాంత రైతులు పరుగులు తీస్తున్నారు. జిల్లాలోని 46 మండలాల్లో మెట్ట నియోజకవర్గాలైన ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది.

ఆత్మకూరు : పశుగ్రాసం కోసం మెట్ట ప్రాంత రైతులు పరుగులు తీస్తున్నారు. జిల్లాలోని 46 మండలాల్లో మెట్ట నియోజకవర్గాలైన ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. అన్నదాతలు ముందస్తు చర్యగా పశుగ్రాసాన్ని నిల్వ చేసుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం వరి కోతలు మిషన్ల ద్వారా చేపడతుండటంతో పశుగ్రాసం కొరత ఏర్పడింది.
 
 గతంలో కూలీలు వరిని కోస్తే పశుగ్రాసం ఇబ్బడిముబ్బడిగానే లభించేది. ప్రస్తుతం కూలీల కొరత, ధరలు, సమయాభావంతో అన్నదాతలు కోత మిషన్లపైనే ఆధారపడుతున్నారు. కోతమిషన్ల ద్వారా వచ్చే గడ్డి అంతంత మాత్రంగా ఉండటంతో దీని కోసం మెట్ట రైతులు సుదూర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో మోపు రూ.100 పైనే ధర ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాక్టర్‌కు రూ. 6 నుంచి 9 వేలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.
 
 వేసవి కొరతను అధిగమించేందుకు...
 ప్రస్తుతం వేసవి తీవ్రత అధికంగా ఉండడం, భూగర్భజలాలు అడుగంటడంతో పశువులకు నీరు, పశుగ్రాసం కొరత ఏర్పడే ప్రమాదముంది. ఇదే తరహా వాతావరణం జూన్ వరకు కొనసాగితే కొరత తప్పదని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కో కరువు మండలానికి మూడు మెట్రిక్ టన్నులు, కరువు లేని మండలాల్లో రెండేసి మెట్రిక్ టన్నుల వంతున పశుగ్రాస విత్తనాలను సరఫరా చేసేందుకు పశుసంవర్థకశాఖ సమాయత్తమైంది.
 కరువు మండలాల సంగతి సరే..
 ప్రభుత్వం జిల్లాలోని వరికుంటపాడు, కొండాపురం, దుత్తలూరు, మర్రిపాడు, ఉదయగిరి, రాపూరు, సైదాపురం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. పశుగ్రాసం కొరత తీర్చేందుకు ప్రత్యేకంగా ఆయా పశుసంవర్థకశాఖ వైద్యశాలల్లో మినీ క్యాటిల్ క్యాంపులు నిర్వహిస్తూ పశువుల దాణాను సబ్సిడీతో రైతులకు సమకూరుస్తున్నారు. కేజీ ధర రూ.14 ఉండగా ప్రభుత్వం రూ.10 సబ్సిడీని ఇచ్చి కేవలం రూ.4 మాత్రమే రైతుల నుంచి వసూలు చేస్తోంది. అయితే మిగతా మండలాల్లోని పశుపోషకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
 
 ముందస్తు చర్యలతో పశుగ్రాస కొరత నివారణ
 పశువులను కాపాడేందుకు ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నాం. మిగిలిన మండలాల్లో పశుగ్రాసాన్ని సరఫరా చేయడం గగనమవుతుందనే ఉద్దేశంతో పశుగ్రాస విత్తనాలను సరఫరా చేస్తున్నాం. ఇప్పటివరకు 84 టన్నుల విత్తనాలను పంపిణీ చేశాం. రైతులు అవసరమైతే ఎంత మోతాదు వరకైనా  సరఫరా చేసేందుకు సిద్ధం.
 -డాక్టర్ శ్రీధర్‌కుమార్, జేడీ, పశుసంవర్థకశాఖ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement