నూతన రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణ నత్తనడకన సాగుతోంది. గుంటూరు జిల్లాలో తుళ్లూరు మినహా తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో ఇది ముందుకు సాగడం లేదు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: నూతన రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణ నత్తనడకన సాగుతోంది. గుంటూరు జిల్లాలో తుళ్లూరు మినహా తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో ఇది ముందుకు సాగడం లేదు. దీనికి తుళ్లూరు మండల రైతులు సానుకూలంగా ఉంటే తాడేపల్లి, మంగళగిరి రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అంగీకార పత్రాలకు బదులు అభ్యంతరం తెలుపుతూ పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టారు. ఇక్కడ భూ సమీకరణ చేయలేమని, పెద్ద సంఖ్యలో కార్యాలయాలకు వస్తున్న రైతులకు సమాధానాలు ఇచ్చే క్రమంలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వ సిబ్బంది చెబుతున్నారు.
తుళ్లూరు రైతులు మొదటినుంచీ సానుకూలమే
రాజధాని ప్రకటన తేదీ నుంచి తుళ్లూరు మండల రైతులు ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. ప్రకటనకు పూర్వం అక్కడి భూముల ధర ఎకరా రూ.10 లక్షలకు మించి లేదు. కొన్ని గ్రామాల్లో సాగునీటి సమస్య ఉంది.
రాజధాని ప్రకటన వెలువడిన వెంటనే ఇక్కడి భూముల ధర ఎకరా రు. 50 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు పలికాయి. ఎక్కువమంది రైతులు సగం భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుని, మిగిలిన భూమి ప్రభుత్వానికి ఇచ్చారు. దాదాపు మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఇదే విధానాన్ని అనుసరించడంతో ఇక్కడ భూసమీకరణ ఎక్కువగా జరిగింది. తుళ్లూరు మండలంలోని గ్రామాలపైనే మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ఎక్కువగా దృష్టిపెట్టి సమీకరణ వేగాన్ని పెంచగలిగారు. మండలంలోని నేలపాడు, ఐనవోలు గ్రామాల్లో బుధవారం నాటికి 90 శాతం సమీకరణ పూర్తయింది. తుళ్లూరు మండలంలో మొత్తం 30 వేల ఎకరాలు సమీకరించాలని లక్ష్యం కాగా ఇప్పటికి 13,632 ఎకరాలు సమీకరించారు.
ఆందోళనల బాటలో తాడేపల్లి, మంగళగిరి రైతులు
తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని ప్రాంతాల రైతులు మొదటినుంచీ భూసమీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు. రాజధాని ప్రకటనకు పూర్వమే తమ పొలాల ధర ఎకరా రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు ఉందని, ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ అవసరం లేదని చెబుతూ వచ్చారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) కూడా ఇక్కడి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఆందోళనలు చేపట్టారు. రైతులతో అభ్యంతర పత్రాలు (ఫారం 9.2) ఇచ్చే కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టారు. భూసమీకరణ సెంటర్లకు రైతులు, ప్రజలు వెల్లువలా వస్తూ అభ్యంతర పత్రాలు ఇస్తుండటంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, అధికారులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం కలెక్టర్ కాంతిలాల్ దండే గుంటూరులో డిప్యూటీ కలెక్టర్లతో భూ సమీకరణపై సమీక్ష నిర్వహించినప్పుడు ఇక్కడ భూసమీకరణ కష్టమని, ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సూచించారు. రైతులంతా న్యాయపోరాటానికి సమాయత్తం అయ్యేందుకు అనువుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారని, అభ్యంతర పత్రాలు ఇచ్చిన సమయంలోనూ తమనుంచి స్టాంప్‌తో కూడిన అక్నాలడ్జ్‌మెంట్ అడుతున్నారని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో 16,520 ఎకరాలు సమీకరించేందుకు నోటిఫికేషన్ జారీచేస్తే ఇప్పటి వరకు 1,978 ఎకరాలు మాత్రమే సమీకరించారు.