భూ సమీకరణ వేగం పెంచేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మిగిలిన మంత్రులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : భూ సమీకరణ వేగం పెంచేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేల కంటే ఆయనే రాజధాని గ్రామాల్లో ఎక్కువగా పర్యటిస్తూ, సంద్రింపులు జరుపుతున్నా రైతులు ఇస్తున్న అంగీకార పత్రాల సంఖ్య రెండు అంకెలకు మించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లనే నారాయణ రోజుకో కొత్త మాట, విధానాన్ని ప్రకటిస్తుండటంతో రైతులకు ఆయనపై నమ్మకం కలగడం లేదు.
ఇప్పటికీ తాత్కాలిక రాజధాని నిర్మాణం, భూ సమీకరణ పూర్తయిన గ్రామాల్లో రాజధాని నిర్మాణ పనుల ప్రారంభం వంటి ప్రకటనలు ఆచరణలోకి రాలేదు. ఇకపై రోజూ రాజధాని గ్రామాల్లోనే ఉంటానని ప్రకటించిన మర్నాడే అక్కడికి రాకపోవడం, వంటి సంఘటనలు మంత్రి నారాయణపై విశ్వసనీయతను కల్పించలేకపోతున్నాయి. రైతు కమిటీలతో భూ సమీకరణ వేగవంతానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనికితోడు భూ సమీకరణకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల రైతులు వేసిన రిట్‌ను హైకోర్టు స్వీకరించడంతో అంగీకారపత్రాలు ఇచ్చిన రైతులు పునరాలోచనలో పడుతున్నారు. ఇంకా ఆరు రోజులే.... భూ సమీకరణకు ఇంకా ఆరు రోజులే మిగిలి ఉంది. ఆశించిన స్థాయిలో రైతుల నుంచి స్పందన రాకపోవడంతో శుక్రవారం మంత్రులు పి. నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, కలెక్టర్ కాంతిలాల్‌దండే రాజధాని గ్రామాల్లో పర్యటించి హడావుడి చేశారు.
మే నెల రెండోవారంలో రాజధాని భూమి పూజ జరుగుతుందనే ప్రకటనతోపాటు మరికొన్ని హామీలు ఇచ్చారు. ముఖ్యంగా శనివారం నుంచి రాజధాని గ్రామాల్లోనే ఉంటూ రైతుల సమస్యలు, సందేహాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఆయన హామీలను నమ్మిన జరీబు రైతులు శనివారం ఆయన కోసం నిరీక్షించారు. గురు, శుక్రవారాల్లో తాడేపల్లి మండల రైతులు ఒక ఎకరాకు కూడా అంగీకార పత్రాలు ఇవ్వలేదు. శనివారం ముగ్గురు రైతులు 6.70 ఎకరాలు ఇచ్చారు.
వీరిలో 2.60 ఎకరాలు ఇచ్చిన వ్యక్తి ఎప్పుడో హైదరాబాద్‌లో వ్యాపారం రీత్యా స్థిరపడ్డారు. మంగళగిరిలో 53.40, తాడేపల్లిలో 6.70 , తుళ్ళూరులో.83.37ఎకరాలు ఇచ్చారు. మొత్తం 144.47 ఎకరాలు మాత్రమే. శనివారం కూడా భూ సమీకరణ పెరగకపోవడానికి మంత్రులు ఇచ్చిన హామీలు అమలులోకి రాకపోవడమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. తాత్కాలిక రాజధాని నిర్మాణ పనులపై సీఎంతోపాటు మంత్రులు అనేక ప్రకటనలు ఇచ్చారు. చివరకు తాత్కాలిక రాజధాని లేదని శుక్రవారం మీడియాకు వెల్లడించారు. భూ సమీకరణ పూర్తయిన గ్రామాల్లో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని పదిహేను రోజుల క్రితం ప్రకటించారు.
98 శాతం భూములు ఇచ్చిన తుళ్ళూరు మండలం నేలపాడు, ఐనవోలు గ్రామాల రైతులు పనుల ప్రారంభం కోసం, ప్రభుత్వం చెల్లించనున్న లీజు మొత్తం కోసం నిరీక్షిస్తున్నారు. వీటితోపాటు ఉద్యాన పంటలు పండిస్తున్న రైతులకు అదనపు ప్యాకేజీ, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని రైతులకు ఆశలు కల్పిస్తున్నా, అవేమీ ఆచరణలోకి రాలేదు. దీనికితోడు సమీకరణ నుంచి తమ భూములను మినహాయించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మంగళగిరి, తాడేపల్లి మండల రైతులు దాఖలు చేసిన రిట్‌ను హైకోర్టు స్వీకరించింది. దీంతో భూములు ఇచ్చిన రైతులు పునరాలోచనలో పడుతుంటే, మిగిలిన రైతులు న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు.