సాధారణ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా మహిళల రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ
శ్రీకాకుళం అర్బన్ : సాధారణ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా మహిళల రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు ఆర్థిక స్వావలంభన సాధిస్తేనే సమాజం పురోగతిలో పయనిస్తుందన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, నేటికీ ఆ హామీ నెరవేర్చలేదన్నారు. డ్వాక్రా రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పావలా వడ్డీకే రుణాలు, వృద్ధులకు పింఛన్లు, వివిధ లోన్‌లు, బీమా పథకాలు ఇప్పించి మహిళాభ్యుదయానికి ఎంతో కృషిచేశారన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. త్యాగం, ఓర్పు, నేర్పు, పోరాటపటిమ మహిళకే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకురాలు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఎం.వి.పద్మావతి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరన్నారు. వారికి మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలను గౌరవించడం మన సంసృ్కతీ, సంప్రదాయమన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఎన్ని ధనుంజయ్, మండవిల్లి రవి, కె.వి.వి.సత్యనారాయణ, ఎం.ఎ. రఫీ, గుడ్ల మల్లేశ్వరరావు, గుడ్ల దామోదరరావు తదితరులు పాల్గొన్నారు.