24 ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలకు సంజాయిషీ నోటీసులు

Explanation Notices For Private Degree Colleges - Sakshi

వీసీ కూన రామ్‌జీ

శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్‌: ఉన్నత విద్యా మండలి, విశ్వవిద్యాలయం నిబంధనలకు వ్యతిరేకంగా జిల్లాలో కొనసాగుతున్న 24 ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలకు సంజాయిషీ నోటీసులు అందజేస్తున్నట్టు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం వీసీ కూన రామ్‌జీ తెలిపారు. వర్సిటీ కాలేజ్‌ డెవలఫ్‌మెంట్‌ కౌన్సిల్‌ డీన్‌ పెద్దకోట చిరంజీవులుతో ఈ సంజాయిషీ నోటీసులు అంశంపై వర్సిటీలో సోమవారం ఆయన చర్చించారు. ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలు, డిగ్రీ కళాశాలల పరిశీలనకు నియమించిన కమిటీలపై చర్చించారు. ఏపీ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ 1982 ప్రకారం నోటీసులు ఇస్తున్నామని, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వపు రిజిస్ట్రార్‌ ఎన్‌.రంగనాథ్, ఇదే విశ్వవిద్యాలయంకు చెందిన న్యాయశాస్త్ర ప్రొఫెసర్‌ ఎల్‌.జయశ్రీ, ఏపీ ఉన్నత విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ టీవీ శ్రీకృష్ణమూర్తి, ఏపీఎస్‌సీహెచ్‌ఈ అకడమిక్‌ సెల్‌ అధ్యాపకురాలు బీఎస్‌ సలీనా, స్థానిక బీఆర్‌ఏయా సీడీసీ డీన్‌ ప్రొఫెసర్‌ పెద్దకోట చిరంజీవులు ప్రైవేటు కళాశాలల్లో అమలవుతున్న నిబంధనలు పరిశీలించనున్నట్టు చెప్పారు. జిల్లాలో 88 ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు ఉండగా, చాలా కళాశాలలను నిబంధనలు అతిక్రమించి నిర్వహిస్తున్నారని తెలిపారు.

జిల్లాలో ఎస్‌వీఆర్‌ డిగ్రీ కాలేజ్‌(పాలకొండ), స్వర్ణభారతి(ఇచ్ఛాపురం), కృష్ణసాయి(సోంపేట), పీపీఆర్‌ఎస్‌ కౌముది(శ్రీకాకుళం), శ్రీ సత్యా(కాశీబుగ్గ), శ్రీకుమార్‌(మందస), టీఎస్‌ఆర్‌(ఆమదాలవలస), అమర్‌(నందిగాం), శ్రీ సాయి(సరుబుజ్జిలి), శ్రీ సిద్ధార్థ(హరిపురం), కృష్ణ సాయి(కంచిలి), షిర్డీసాయి(కాశీబుగ్గ), కిరణ్మయి(పాతపట్నం), రంగముద్రి(రాజాం), రామలీల(పాలకొండ), సంస్కార భారతి(సోంపేట), శ్రీ సాయికృష్ణ(కాశీబుగ్గ), ఎస్‌వీజే(కవిటి), సూర్యతేజ(పలాస), శాంతినికేతన్‌(రణస్థలం), కౌముది(ఆమదాలవలస), శ్రీరామా(అట్టలి), శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాల(శ్రీకాకుళం)కు సంజాయిషీ నోటీసులు అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కళాశాలల నుంచి వివరణ సేకరించి, ఉన్నత విద్యా మండలికి సమాచారం అందజేస్తామని అన్నారు. అనంతరం వారి నిర్ణయం మేరకు చర్యలు ఉంటాయని చెప్పారు. నిబంధనలు మేర కు ఐదేళ్లు దాటాక సొంత భవనాల్లోకి కళాశాలలు షిఫ్టు చేయాల్సి ఉంటుందని, అయితే నిబంధనలు పాటి ంచకుండా, యూనివర్సిటీకి సమాచారం ఇవ్వకుండా కళాశాలలు నిర్వహిస్తూ ముందుకు పోతున్నారని చెప్పారు. అద్దెభవనాల్లో నిర్వహించటంతో మౌలిక వసతులు కనీసం పాటించటం లేదని తెలిపారు. డిగ్రీ కళాశాలల్లో విద్యా బోధన బలోపేతం, మౌలిక వసతులపై ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా దృష్టిసారించిందన్నారు.

రెండో రెక్టార్‌గా చిరంజీవులు
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం రెక్టార్‌గా ప్రస్తుత ప్రిన్సిపాల్, సీడీసీ డీన్‌ చిరంజీవులును నియమిస్తూ ఉత్తర్వులు అందజేసినట్టు వీసీ రామ్‌జీ చెప్పారు. రెండో రెక్టార్‌గా ఈయన బాధ్యతలు నిర్వహించనున్నారు. జూన్‌ 30న ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. గతంలో మొదటి రెక్టార్‌గా ప్రొఫెసర్‌ మిర్యాల చంద్రయ్య వ్యవహరించారు. ఆయన ఉద్యోగ విరమణ తర్వాత ప్రస్తుతం రెక్టార్‌ పోస్టు ఖాళీగా ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top