జిల్లాలో పర్యాటకాభివృద్ధి ఎక్కడే వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా మారింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చిరంజీవి నగరంపై వరాలు వర్షం కురిపించారు.
- గాంధీకొండ అభివృద్ధి హుళక్కేనా!
- కాగితాలకే పరిమితమైన నిధుల మంజూరు
- పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి చేసింది శూన్యమే!
- లగడపాటి హడావుడే ఎక్కువ
సాక్షి, విజయవాడ : జిల్లాలో పర్యాటకాభివృద్ధి ఎక్కడే వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా మారింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చిరంజీవి నగరంపై వరాలు వర్షం కురిపించారు. గత ఎన్నికల్లో నగరం నుంచి పీఆర్పీ తరఫున ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నిక కావడంతో.. వారు చిరంజీవి ద్వారా నిధులు తీసుకొచ్చి పర్యాటక అభివృద్ధికి పాటుపడతారని ప్రజలు కూడా ఆశించారు.
ఇప్పటి వరకు చిరంజీవి హామీలు అమలుకు నోచుకోలేదు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా కొండపల్లి సర్క్యూట్ ప్రాజెక్టు, గాంధీకొండకు నూతన శోభ, కూచిపూడి గ్రామాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చేందకు కేంద్ర పర్యాటక శాఖ నిధులు మంజూరు చేస్తోందంటూ హడావుడి చేశారు. ఆయన కూడా నిధులు రాబట్టలేకపోయారు. ప్రస్తుత యూపీఏ-2 ప్రభుత్వానికి చివర రోజులు కావడం... ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించడంతో పర్యాటకాభివృద్ధి సాధ్యమేనా.. అని ప్రజలు సంశయిస్తున్నారు.
గాంధీకొండ అభివృద్ధి హుళక్కే!
గాంధీకొండపై రూ.5 కోట్లతో బిర్లా ప్లానిటోరియం, ఆధునిక టెక్నాలజీతో రైలు, మ్యూజిక్ ఫౌంటెయిన్, వివిధ రకాల అందమైన చెట్లు, పిల్లలు ఆడుకునేందుకు సరికొత్త క్రీడాపరికరాలు, గాంధీ స్థూపానికి సొబగులు, పర్యాటకులను ఆకట్టుకునేలా గ్రీనరీ ఏర్పాటుచేస్తామని ప్రజాప్రతినిధులు ప్రకటించారు. అప్పటి కలెక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి కూడా గాంధీకొండ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. వివిధ శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించారు. ఆయన బదిలీ తర్వాత ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకునేవారే కరువయ్యారు.
కేంద్రం వద్దనే ఫైల్ పెండింగ్!
చిరంజీవి, లగడపాటి రాజగోపాల్ హామీల వరద కురిపించడంతో జిల్లా పర్యాటక శాఖ అధికారులు గాంధీకొండ అభివృద్ధికి ప్రాజెక్టు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపారు. ఈలోపు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం కావడంతో ఆ ఫైల్ కేంద్రం వద్ద పెండింగ్‌లో పడింది. పార్లమెంట్ సమావేశాలు పూర్తికాగానే ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో జిల్లాలో పర్యాటకాభివృద్ధికి నిధులు మంజూరు చేసే ఫైల్స్ క్లియర్ చేయడం సాధ్యపడకపోవచ్చని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో గాంధీ కొండ అభివృద్ధి కాగితాలకే పరిమితం అయింది.
కొండపల్లి సర్క్యూట్ ప్రాజెక్టు తీరూ అంతే..
కొండపల్లి పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం సర్క్యూట్ ప్రాజెక్టు రూపొందించారు. ఈ ప్రాజెక్టు అమలుకు రూ.50 కోట్లు మంజూరు అవుతాయని, కొండపల్లిలో అభివృద్ధి పనులతోపాటు హస్తకళా వస్తువుల పరిశ్రమ ఏర్పాటు చేయాలని జిల్లా పర్యాటక శాఖ అధికారులు నిర్ణయించారు. పెడనలో చేనేత పరిశ్రమ, మంగినపూడి బీచ్, కూచిపూడి గ్రామం తదితర పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలని భావించారు. ఇందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. అయితే ఒక్క రూపాయి కూడా మంజూరు కాకపోవడంతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది.