ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ

Elections Will Conduct In Peace Manner  - Sakshi

సాక్షి, పాలకొండ : జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ పూర్తి చేసేందుకు పక్కాగా ఏర్పాట్లు చేపడుతున్నామని కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. శుక్రవారం ఆయన పాలకొండ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కొత్తగా ఓటు నమోదు కోసం 84వేల దరఖాస్తులు అందాయని, అందులో ఇంకా 24వేల దరఖాస్తులు పరిశీలించి ఓటరు కార్డులు జారీ చేయాల్సి ఉందని తెలిపారు.

వీరందరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇంతవరకూ జిల్లాలో 2,674 ఓట్లు తొలగించామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి పీవో, ఏపీవోలను నియమించామని వారికి 16వ తేదీన నియోజకవర్గాల్లో శిక్షణ అందిస్తామని వివరించారు. వచ్చేనెల 3వ తేదీన మరో మారు శిక్షణ అందించాల్సి ఉందని తెలిపారు. ప్రతి మండలానికి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. వారితో పాటు 50మందిని ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి నిఘా పెంచామని వివరించారు.

ఉధ్యోగులు ఎటువంటి ఇబ్బంది పడకుండా పోస్టల్‌ బ్యాలెట్‌లు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. 470 పోలింగ్‌ కేంద్రాలకు ర్యాంపులు ఏర్పాటు చేశామని, 62  కేంద్రాలకు మరుగుదొడ్లు, 71 కేంద్రాల్లో తాగునీటి బోర్లు అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. మద్యం, ధనం, ఎన్నికల నియమావళి అమలుకు ప్రత్యేక బృందాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం ఆయన డీఎస్పీ ప్రేమ్‌కాజల్‌తో మాట్లాడి బందోబస్తు ఏర్పాట్లపై సూచనలు అందజేశారు. ఈవీఎంలను భద్రపరచనున్న డిగ్రీ కళాశాలను సందర్శించి పరిశీలించారు.  పర్యటనలో కలెక్టర్‌తో పాటు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఎల్‌.రఘుబాబు, తహసీల్దార్‌ నరసింహ, ఎన్నికల సిబ్బంది ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top