శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీ ఇక్కడేనా..!

This Educational Year Continues Srikakulam IIIT College - Sakshi

ఈ ఏడాదీ ఇక్కడే కొనసాగే అవకాశం

ఇప్పటికే వేధిస్తున్న నీటి సమస్య

9500లకు చేరనున్న విద్యార్థుల సంఖ్య

నూజివీడు : రెండేళ్లుగా నూజివీడు ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో తాత్కాలికంగా నిర్వహిస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీని రాబోయే విద్యాసంవత్సరానికి కూడా శ్రీకాకుళం జిల్లాలోని ఎస్‌ఎంపురానికి తరలించే సూచనలు కనిపించడం లేదు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి పీయూసీ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభంకానున్న నేపధ్యంలో శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల సంఖ్య 3వేలకు చేరనుంది. దీనికి తోడు నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు 6500 మందిని కలిపితే  మొత్తం విద్యార్థుల సంఖ్య 9500లకు చేరనుంది. అయితే ఇంత మంది విద్యార్థులకు తరగతులు నిర్వహించడానికి తరగతి గదులు, ఉండటానికి హాస్టల్‌ గదులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇతర విషయాల్లో సమస్యలు మాత్రం పెద్ద ఎత్తున ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వేధించనున్న నీటి సమస్య...
నూజివీడు ట్రిపుల్‌ఐటీలో గత కొన్ని నెలలుగా నీటి సమస్య వేధిస్తోంది. ఈ పరిస్థితుల్లో దాదాపు 10 వేలకు చేరుతున్న విద్యార్థులకు సరిపడా నీటి లభ్యత లేని పరిస్థితులు ఉన్నాయి. 9500 మంది విద్యార్థులకు, క్యాంపస్‌లోనే ఉంటున్న సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కలిపి మరో 1000 మంది ఉన్నారు. వీరందరికి రోజుకు కనీసం 12 లక్షల నుంచి 15 లక్షల లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. ప్రస్తుతం క్యాంపస్‌లో 23 బోర్లు ఉండగా ఈ బోర్ల మోటర్లు 12 గంటలు పనిచేస్తే కేవలం 4 లక్షల లీటర్లు మాత్రమే వస్తున్నాయి. పురపాలకసంఘంకు చెందిన కృష్ణాజలాల ప్రాజెక్టు నుంచి రోజుకు 5నుంచి 6 లక్షల లీటర్లు వస్తున్నాయి. ఈ రెండు వనరుల నుంచి కేవలం 10 లక్షల లీటర్లు మించి రావడం లేదు. ఇంకా 5 లక్షల లీటర్లు నీళ్లు అవసరమై ఉంది. నూతన బోర్లు వేస్తున్నా భూగర్భజలాలు లేక బోర్లలో నీళ్లు పడటం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా నీటి సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితి నెలకొంది.

శ్రీకాకుళంకు పాత క్యాంపస్‌ కేటాయింపు
శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం కూడా ప్రారంభంకానున్న నేపథ్యంలో నూజివీడు ట్రిపుల్‌ఐటీతో సంబంధం లేకుండా గతంలో నూజివీడు ట్రిపుల్‌ఐటీకి చెందిన పీయూసీ తరగతులు నిర్వహించిన ప్రీఫ్యాబ్‌ క్యాంపస్‌ను శ్రీకాకుళంకు అప్పగించారు. దీంతో ప్రీఫ్యాబ్‌  దీనిలో పీయూసీ తరగతులు నిర్వహించడానికి, హాస్టల్‌ గదుల ఏర్పాటుకు, స్టాఫ్‌ గదులకు, ల్యాబ్‌లకు సరిపోతుంది.

ఎందుకు తరలించలేకపోతున్నారు...
రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీని ఏర్పాటు చేసి రెండేళ్లవుతున్నా ఇక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లాకు మార్చడంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురంలో ప్రభుత్వం స్థలంతో పాటు 21వ శతాబ్దం గురుకులం భవనాలను సైతం ట్రిపుల్‌ఐటీకి  కేటాయించింది. అంతేగాకుండా ఎచ్చెర్లలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలను నెలకు రూ.4లక్షలకు అద్దెకు సైతం తీసుకుని గత ఏడాది అక్టోబర్‌ నుంచి అద్దె చెల్లిస్తున్నారు. అయినప్పటికీ శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీని మాత్రం తరలించడం లేదు. 21వ శతాబ్దం గురుకులం భవనాల్లోను, అద్దెకు తీసుకున్న ఇంజినీరింగ్‌ కళాశాల భవనాలలో 5వందల మందిని మాత్రమే ఉంచడానికి కుదురుతుంది. దీంతో అక్కడే రెండు క్యాంపస్‌లు నిర్వహించాలంటే పరిపాలనా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో పూర్తిస్థాయిలో భవనాలు అందుబాటులోకి వచ్చిన తరువాతే అక్కడకు మారాలని ఛాన్సలర్‌ పేర్కొనట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ఏడాది కూడా ఇక్కడే తరగతులు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top