
అవనిగడ్డ/నాగాయలంక : కృష్ణా జిల్లా దివిసీమలోని గుల్లలమోదలో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ఆమోదముద్ర లభించింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటులో కీలకమైన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనల సడలింపు నిర్ణయానికి శుక్రవారం పర్యావరణశాఖ అంగీకరించింది. పనులు ప్రారంభించుకోవచ్చని, ఈ మేరకు వారం రోజుల్లో లిఖిత పూర్వక ఆదేశాలు వెలువడించనున్నట్టు కేంద్రానికి పర్యావరణ మంత్రిత్వశాఖ తెలియజేయడంతో అన్ని అవరోధాలు తొలగిపోయాయి. తొలిదశగా రూ. 800 కోట్లు, రెండో దశలో రూ. 1,000 కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయనున్నట్టు డీఆర్‌డీవో(రక్షణ పరిశోధన సంస్థ) అధికారులు ప్రకటించారు. దేశంలోనే రెండో అతి పెద్ద క్షిపణి పరీక్ష కేంద్రం దివిసీమలో ఏర్పాటు చేయనుండటంతో కృష్ణా జిల్లాకు ప్రత్యేక గుర్తింపు రానుంది.
నాలుగేళ్ల నుంచి నిరీక్షణ..
గుల్లలమోదలో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో క్షిపణి పరీక్ష కేంద్రం(మిస్సైల్ లాంచింగ్ స్టేషన్) ఏర్పాటు కోసం నాలుగేళ్ల కిందట అంకురార్పరణ జరిగింది. ఇందుకోసం 381.61 ఎకరాలు అటవీ భూములను కేటాయించారు. అప్పటి నుంచి పర్యావరణ, అటవీశాఖ అనుమతులు, రైతులకు నష్టపరిహారం సమస్య వంటి అవరోధాలు వల్ల ప్రాజెక్టు జాప్యం అవుతూ వచ్చింది. రక్షణ కేంద్రం ఏర్పాటుకు అటవీభూమిని కేటాయించడం పట్ల సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు చేసింది. ఈ అటవీ భూములకు ప్రతిఫలంగా అంతే విస్తీర్ణంలో సొర్లగొందిలోని ఆర్‌ఎస్ నెంబర్ 674లో ఉన్న ఉన్న రెవెన్యూ భూమిని అటవీశాఖకు ఈ ఏడాది జనవరిలో బదలాయించడంతో ప్రధాన అడ్డంకి తొలగింది. రైతులకు నష్టపరిహారం సమస్యను కూడా పరిష్కరించారు. పర్యావరణ నిబంధనలు కొన్ని అడ్డంకుగా ఉండగా.. సడలింపుకు పర్యావరణ శాఖ శుక్రవారం అంగీకరించింది. దీంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.
దివిసీమ ముఖ్య అధికారి కీలకపాత్ర
ఈ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకురావడంలో దివిసీమలోని పెదకళ్లేపల్లికి చెందిన ఢిల్లీలోని ఏపీ భవన్ కమిషనర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. న్యూఢిల్లో ఉండే ఆయన పర్యావరణ అనుమతుల కోసం 18 నెలలుగా శ్రమించారు. అటవీశాఖ అనుమతితో పాటు, అటవీశాఖకు రెవెన్యూభూమిని బదలాయించడం, పర్యావరణ అనుమతికోసం డీఆర్‌డీవో నిపుణులను ఈ ప్రాంతానికి తీసుకురావడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్యోగ, ఉపాధి, రహదారుల అభివృద్ధి, చెట్ల పెంపకంతో పాటు దివిసీమ రూపు రేఖలు మారిపోనున్నాయి.