ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు, సర్వత్రా హర్షం

Dr YSR Aarogyasri Scheme Expansion Order Released - Sakshi

సాక్షి, అమరావతి: ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన ప్రతిష్టాత్మక డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇతర రాష్ట్రాల ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రజలకు నవంబర్‌ 1వ తేదీ నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉన్న 150 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో (ఏపీలో ఇప్పటికే వైద్య సేవలు అందుతున్నాయి) ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 716 సూపర్ స్పెషాలిటీ ట్రీట్‌మెంట్లకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజారోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు మంజూరు
తలసేమియా, సికిల్‌సెల్ డిసీజ్, సివియర్ హీమోఫీలియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెల​కు రూ. 10 వేలు పెన్షన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బోధకాలు, పక్షవాతం, ప్రమాద బాధితులకు నెలకు రూ.5 వేలు పింఛన్‌ ఇవ్వనున్నట్టు ఇందులో పేర్కొంది. జనవరి 1 నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతుందని వెల్లడించింది.

కోలుకునే వరకు సహాయం
ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్‌ చేయించుకున్న పేషెంట్లు కోలుకునే వరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున ఇస్తామని, రోగి ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే నెలకు రూ.5 వేలు చెల్లిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీకి అనుగుణంగా నేడు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు వెలువరించింది. డిసెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

పారిశుధ్య కార్మికులకు తీపికబురు
ఆస్పత్రుల్లోని పారిశుధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలకు మేరకు వారి వేతనాలను భారీగా పెంచుతూ ఉత్తర్వులు వెలువరించింది. తాజా పెంపుతో పారిశుధ్య కార్మికులు నెలకు రూ. 16 వేల వరకు జీతం అందుకోనున్నారు. ఇది వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యారోగ్య కళాశాలల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు ఈ పెంపు వర్తిస్తుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top