గడువు పెంచినా ఇబ్బంది లేదు: కె.చంద్రశేఖర్‌రావు | Do not bother to increase the deadline, says K. Chandrashekar rao | Sakshi
Sakshi News home page

గడువు పెంచినా ఇబ్బంది లేదు: కె.చంద్రశేఖర్‌రావు

Jan 18 2014 4:11 AM | Updated on Aug 15 2018 8:06 PM

గడువు పెంచినా ఇబ్బంది లేదు: కె.చంద్రశేఖర్‌రావు - Sakshi

గడువు పెంచినా ఇబ్బంది లేదు: కె.చంద్రశేఖర్‌రావు

విభజన బిల్లుపై శాసనసభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి ఇచ్చిన గడువును పెంచినా తెలంగాణ ఆవిర్భావానికి ఎలాంటి ఆటంకం ఉండదని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్: విభజన బిల్లుపై శాసనసభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి ఇచ్చిన గడువును పెంచినా తెలంగాణ ఆవిర్భావానికి ఎలాంటి ఆటంకం ఉండదని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి తదితరులతో శుక్రవారం కేసీఆర్ తన నివాసంలో పలు అంశాలపై చర్చలు జరిపారు. ‘శాసనసభ అభిప్రాయం కోసం మరో వారం, పదిరోజులు రాష్ట్రపతి గడువును  పెంచుతారని ప్రచారం జరుగుతోంది. వందశాతం పెంచకపోవచ్చు. ఒకవేళ పెంచినా ఫరాక్ (తేడా, ప్రభావం) పడదు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘పెన్షనర్ల స్థానికతను బట్టి విభజన ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యోగి రిటైరైతే తెలంగాణ రాష్ట్రం, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగి రిటైరైతే ఆ రాష్ట్రం పెన్షన్‌ను భరించాలి.
 
 తెలంగాణ ప్రాంత ఉద్యోగ అవకాశాలను ఆంధ్రా వారు కొల్లగొట్టారనే అంశంపై మనం కొట్లాడుతున్నప్పుడు మళ్లీ పెన్షన్లను ఎలా భరిస్తాం, దీనిపై పోరాటం చేయాల్సిందే’ అని కేసీఆర్ అన్నారు. గవర్నర్ చేతికి శాంతి భద్రతలు, పదేళ్ల ఉమ్మడి రాజధాని వంటి ఇతర అంశాలతో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి వచ్చే అవరోధం ఏమీ ఉండకపోవచ్చని పేర్కొన్నారు. కాగా, ఫిబ్రవరి మొదటివారంలో ప్రధానమంత్రిని కలిసి వివిధ అంశాలపై సవరణల కోసం వినతి పత్రం ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ పి.సుదర్శన్‌రెడ్డితో కేసీఆర్, కేకే శుక్రవారం సమావేశమయ్యారు. ప్రధానికి అందించాల్సిన వినతిపత్రంపై మూడు గంటల పాటు చర్చించి ముసాయిదా ప్రతిని రూపొందించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement