జెడ్పీలో సమస్యల ‘కొలువు’ | Sakshi
Sakshi News home page

జెడ్పీలో సమస్యల ‘కొలువు’

Published Fri, Jul 4 2014 2:53 AM

Deputy CEO empty, some posts

  •  ఖాళీగా డెప్యూటీ సీఈవో, ఏవో పోస్టులు
  •  వరుస ఎన్నికలే భర్తీకి అడ్డంకి
  •  అదనపు బాధ్యతలతో సీఈవో సతమతం
  •  పాలకవర్గం నియామకం అనంతరమే భర్తీ
  •  భారీఎత్తున పైరవీలు !
  • కలెక్టరేట్(మచిలీపట్నం) : జిల్లా పరిషత్ కార్యాలయంలో సమస్యలు తిష్టవేశాయి. జిల్లా పరిషత్ డెప్యూటీ సీఈవో, గణాంకాధికారి పోస్టులు భర్తీ చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మూడు సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న ఎంపీడీవోలను బదిలీ చేయాలనే ఆదేశాల నేపథ్యంలో ఫిబ్రవరి 25వ తేదీన ఎంపీడీవోలను బదిలీ చేయటంతో అప్పటి వరకు డెప్యూటీ సీఈవోగా ఉన్న జీవీ సూర్యనారాయణ, గణాంకాధికారిగా పనిచేస్తున్న అనూరాధ బదిలీ కావ డంతో అప్పటినుంచి  ఈ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

    అయితే ఫిబ్రవరి 25వ తేదీన జిల్లా పరిషత్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన డి.సుదర్శనం వరుస ఎన్నికల  నిర్వహణ ప్రక్రియలో బిజీ అయ్యారు. సాధారణ ఎన్నికల్లో భాగంగా మైలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా నియమితులు కావడంతో అక్కడే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం సీఈవో కుమారుడు వివాహం కోసం పది రోజులు సెలవుపై వెళ్లారు.

    తిరిగి బాధ్యతలు స్వీకరించిన సీఈవో నూతన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమ ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు.   నాలుగు నెలలుగా జెడ్పీ కార్యాలయంలో నెలకొన్న పలు సమస్యలపై  దృష్టి సారించేందుకు సీఈవోకు ఖాళీ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
     
    పైరవీలెన్నో...


    జిల్లా పరిషత్ డెప్యూటీ సీఈవో, గణాంకాధికారి పోస్టుల కోసం కొంతమంది ఎంపీడీవోలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల నేపథ్యంలో బదిలీ అయిన ఎంపీడీవోలు తిరిగి జిల్లాలో అదే స్థానంలో రావటంతో డెప్యూటీ సీఈవో, గణాంకాధికారి పోస్టుల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఇన్‌చార్జ్ సీఈవోగా పనిచేసిన చింతా కళావతి తానే అందరి కంటే సీనియర్ నంటూ ముందుగా ఆమె ప్రయత్నాలు ప్రారంభించారు.

     సంఘ నాయకుల ఆశీస్సులతో ఈ పోస్టును తానే దక్కించుకుంటానని బందరు ఎంపీడీవో జీవీ సూర్యనారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో అందరికంటే డెరైక్ట్ ఎంపీడీవోలుగా బాధ్యతలు స్వీకరించామని తామే అందరి కంటే సీనియర్ ఎంపీడీవోలమని న్యాయపరమైన పోరాటం చేస్తున్న ఆర్‌వీఎం పీవో వి.జ్యోతిబసు, ఉయ్యూరు ఎంపీడీవో కృష్ణమోహన్ డెప్యూటీ సీఈవో, గణాంకాధికారి పోస్టు కోసం పోటీ పడుతున్నారు.
     
    పాలకవర్గం వచ్చిన తరువాతే పోస్టుల భర్తీ:
     
    జిల్లా పరిషత్ పాలకవర్గం ప్రమాణస్వీకారం అనంతరం డెప్యూటీ సీఈవో, గణాంకాధికారి పోస్టులను భర్తీ చేస్తామని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి దాసరి సుదర్శనం ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయులకు సంబంధించి పీఎఫ్ రుణ దరఖాస్తులు ఇప్పటి వరకు పెండింగ్ లేవని అన్నీ క్లియర్ చేశామని చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో ఉపాధ్యాయుల ఖాతాలకు రుణ మొత్తం  జమ అవుతాయన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
     

Advertisement
Advertisement