‘డెంగీ’ తాండవం! 

Dengue Fever cases Increased In Krishna - Sakshi

జ్వరపీడితులతో ఆస్పత్రులు కిటకిట

 రోజురోజుకూ పెరుగుతున్న మృతులు

ఒక్కసారిగా మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వీటి బారిన పడి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు పాముకాటు కేసులతో నిండిపోయిన ఆస్పత్రులు, నేడు జ్వరపీడితులతో కిట కిటలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా డెంగీ వ్యాధి కోరలు చాస్తుండటం ప్రజానీకాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కృష్ణా   వరదలకు తోడు వర్షాల కారణంగా వాతావరణంలో వచ్చిన మార్పులు, పారిశుద్ధ్య లోపంతో దోమలు స్వైర విహారం చేస్తూ జనంపై దండెత్తుతున్నాయి.

సాక్షి,మచిలీపట్నం(కృష్ణా): జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. గత పది రోజుల కాలంలో జ్వరాల బారిన పడి సుమారుగా 20 మందికిపైగానే మృత్యువాతపడ్డారు. డెంగీ వ్యాధి సోకి మరణాలు సంభవిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ వద్ద నమోదవుతున్న గణాంకాలు కూడా కొంత ఆందోళన కరంగానే ఉన్నాయి. గత ఏడాది మలేరియా కేసులు 28 నమోదు కాగా, 102 మందికి డెంగీ సోకినట్లుగా లెక్కలున్నాయి. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి 20 మందికి మలేరియా 121 మందికి డెంగీ వ్యాధి సోకినట్లుగా పరీక్షల్లో వెల్లడైంది. ఎక్కువగా విజయవాడ వంటి నగరాల్లోనే డెంగీ వ్యాధి గ్రస్తులు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాంతాల్లోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. 

ప్రైవేటు ల్యాబ్‌ల దోపిడీ..
జ్వరంతో వైద్యం కోసమని ఆస్పత్రికి వచ్చే రోగులను కొన్ని ప్రైవేటు ల్యాబ్‌ రక్త పరీక్షలతో దోపిడీ చేయటమే కాకుండా, డెంగీ నిర్థారణ చేస్తూ వారిని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ టీఎస్‌ఆర్‌ మూర్తి ఇటీవల మచిలీపట్నంలోని మూడు ల్యాబ్‌లను పరిశీలించగా, వ్యాధి నిర్థారణ పరీక్షలకు సంబంధించి ల్యాబ్‌ నిర్వాహకుల వద్ద ఎటువంటి రికార్డులు అందుబాటులో లేకపోవటాన్ని గుర్తించారు. మొవ్వ మండలంలో ముందస్తు అనుమతులు లేకుండానే ల్యాబ్‌ నిర్వహిస్తుండటమే, కాకుండా తనిఖీకి వెళ్లిన సమయంలో ఎటువంటి ఒరిజనల్‌ ధ్రువపత్రాలు చూపించకపోవటంతో దానికి తాళాలు వేశారు. ప్రైవేటు ల్యాబ్‌లు మలేరియా, డెంగీ వ్యాధులను బూచిగా చూపి, వివిధ రకాల పరీక్షల పేరుతో దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

నిరుపయోగంగా పరికరాలు..
ఎలీసా పరీక్ష ద్వారా నిపుణుల సమక్షంలో చేసిన డెంగీ వ్యాధి నిర్థారణ చేయాలి. జిల్లాలో ఒక్క విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఇటువంటి సదుపాయం ఉంది. ప్రైవేటు ల్యాబ్‌ల్లో డెంగీని నిర్థారించడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రమైన మచిలీపట్నం ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో 2007లో డెంగీ నిర్థారణ చేసే పరికరాన్ని సరఫరా చేశారు. కానీ దీనికి అనుసంధానంగా వాషర్‌ అనే పరికరం లేకపోవటంతో పరీక్షలు చేసే అవకాశం లేక దానిని మూలన పెట్టేశారు. రూ. 2 నుంచి 3 లక్షల లోపు ఖర్చు చేస్తే పరికరాలను సమకూర్చవచ్చు. కానీ ఇటువంటి సమస్యలపై గత టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవటంతో ఉపయోగంలోకి రాలేదు. 2017లో బ్లడ్‌ బ్యాంక్‌లో రీడర్, వాషర్‌ కొత్తపరికరాలు వచ్చాయి. అయితే రక్త నిధి సేకరణ చోట డెంగీ పరీక్షలు చేయకూడదని నిపుణులు చెప్పటంతో అధునాతన పరికరాలు ఉన్నప్పటకీ పెద్దాసుపత్రిలో డెంగీ నిర్ధారణ పరీక్షలు మాత్రం జరుగటం లేదు. జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ దీనిపై దృష్టి సారించి,  పరిస్థితి చేయిదాటిపోకముందే సంబంధిత శాఖలను సమన్వయం చేసి, విష జ్వరాల నివారణకు అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతున్నారు. 

విషజ్వరాలతో ముగ్గురు మృతి..
జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలతో మంగళవారం ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలంలోని వేమవరం గ్రామానికి చెందిన ఎం. కృష్ణ(30), తిరువూరు నియోజకవర్గం  చీమలపాడుకు చెందిన విజయ్‌బాబు(10), ఏ. కొండూరు గ్రామానికి చెందిన వనపర్ల భామయ్య(50) విషజ్వరాలకు బలయ్యారు.

అప్రమత్తంగా ఉన్నాం..
సీజనల్‌ వ్యాధులపై వైద్య ఆరోగ్యశాఖ పరంగా అప్రమత్తంగానే ఉన్నాం. విషజ్వరాలు ఉన్నట్లుగా మా దృష్టికి వచ్చిన వెంటనే వైద్య బృందాలను పంపించి ఇంటింటి సర్వే చేయిస్తున్నాం. డెంగీ నిర్థారణ ప్రైవేటు ల్యాబ్‌ల్లో చేయడానికి వీల్లేదు. ప్రైవేటు ల్యాబ్‌లపై తనిఖీలు చేస్తున్నాం. మచిలీపట్నంలో డెంగీ వ్యాధి నిర్థారణ పరీక్షలు చేసేలా ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్తాం. వైద్య విధాన పరిషత్‌ అధికారులతో కూడా మట్లాడుతాం. 
– డాక్టర్‌ టీఎస్‌ఆర్‌ మూర్తి, డీఎంహెచ్‌ఓ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top