పార్టీ మారలేదని... | Dalit Sarpanch is harassment on TDP minister somireddy | Sakshi
Sakshi News home page

పార్టీ మారలేదని చెక్‌పవర్‌ రద్దు

Dec 8 2017 12:36 PM | Updated on Aug 10 2018 8:34 PM

Dalit Sarpanch is harassment on TDP minister somireddy - Sakshi

పొదలకూరు: పార్టీ మారలేదని వేధింపులకు గురిచేస్తూ మంత్రి సోమిరెడ్డి తన చెక్‌పవర్‌ రద్దు చేయించారని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు సర్పంచ్, వైఎస్సార్‌ సీపీ పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ తెనాలి నిర్మలమ్మ పేర్కొన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కొంతకాలంగా టీడీపీలో చేరాలని మంత్రి పరోక్షంగా సంకేతాలు ఇస్తూ వచ్చారన్నారు. అయితే తాము ఊపిరి ఉన్నంత వరకు పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పామన్నారు. దీంతో దళిత మహిళా సర్పంచ్‌నైన తనపై వేధింపులను మొదలు పెట్టి, టీడీపీకి చెందిన ఎంపీటీసీ, వార్డుసభ్యులతో డీపీఓకు ఫిర్యాదు చేయించి డీఎల్పీఓ వద్ద విచారణ జరిపించారన్నారు. ఎలాంటి అవకతవకలు జరగలేదని అధికారులు తేల్చినా మంత్రి నెలరోజులుగా జిల్లా స్థాయి అధికారిపై ఒత్తిడి తెచ్చి చెక్‌పవర్‌ రద్దు చేయాల్సిందిగా ఆదేశించారన్నారు. ఈ క్రమంలో డీపీఓ ఉత్తర్వులు ఇచ్చినట్టు తమకు తెలిసిందన్నారు.

13వ ఆర్థిక సంఘం నిధులు రూ.12 లక్షలు,ఇతర నిధులు రూ. 51 లక్షలు దుర్వినియోగం చేశామని చూపుతూ చెక్‌పవర్‌ రద్దు చేసినట్టు ఉత్తర్వుల్లో చూపారన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధుల ఖర్చుకు సంబంధించి ప్రతి అంశంపై రికార్డులను చూపామని, తాను ప్రతిదీ పరిశీలించి సంతకం చేశానన్నారు. రూ.51 లక్షల్లో విద్యుత్‌ బిల్లులు, పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు బ్యాంకు ద్వారా చెల్లించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేశారని చూపుతూ చెక్‌పవర్‌ తొలగించారన్నారు. ఇది రాజకీయకక్ష సాధింపులో భాగమన్నారు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తామన్నారు. ఎంపీపీ కోనం బ్రహ్మయ్య మాట్లాడుతూ సర్పంచ్‌ అవినీతిని నిరూపిస్తే తాను కూడా రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు.

ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన సర్పంచ్‌ నిధుల దుర్వినియోగానికి పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. సర్పంచ్‌ భర్త డాక్టర్‌ శ్రీహరి మాట్లాడుతూ పొదలకూరులో మూడు దశాబ్దాలుగా తాను పేదల డాక్టర్‌గా పేరు సంపాదించుకున్నట్టు తెలిపారు. తాను సంపాదించుకోవాలంటే ప్రాక్టీసు ద్వారా ఎప్పుడో రూ.కోట్లు ఆర్జించవచ్చన్నారు. పేదలకు సేవచేసిన భాగ్యంతో ప్రజలు 2,300 ఓట్ల మెజారిటీ అందించారన్నారు. ప్రాణత్యాగానికైనా వెనకాడబోమని అవినీతికి పాల్పడే ప్రశ్నేలేదన్నారు. ఉపసర్పంచ్‌ సోమా అరుణ కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement