దూకుడు పెంచిన ‘ఫొని’   | Cyclone Fani intensifies into extremely severe cyclone | Sakshi
Sakshi News home page

దూకుడు పెంచిన ‘ఫొని’  

May 1 2019 4:00 AM | Updated on May 1 2019 10:10 AM

Cyclone Fani intensifies into extremely severe cyclone - Sakshi

తుపాను దిశను తెలుపుతున్న శాటిలైట్‌ చిత్రం

సాక్షి, విశాఖపట్నం: ఫొని తుపాను మరింత దూకుడు పెంచింది. అతి తీవ్ర తుపాను నుంచి పెను తుపానుగా మారి ఒడిశా వైపు దూసుకుపోతోంది. గంటకు 6–12 కిలోమీటర్ల వేగంతో సోమవారం వరకు పయనిం చిన ‘ఫొని’ మంగళవారం రెట్టింపు వేగంతో (22 కి.మీలు) కదులుతోంది. విశాఖకు దక్షిణ, ఆగ్నేయ దిశగా 510 కి.మీ.ల దూరంలో, ఒడిశాలోని పూరీకి దక్షిణ నైరుతి దిశగా 730 కిలోమీటర్ల దూరంలోనూ మంగళవారం రాత్రి కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతోంది. వాయవ్య దిశగా పయనిస్తున్న ఈ పెను తుపాను బుధవారం ఉదయానికి మలుపు (రికర్వ్‌) తిరిగి ఉత్తర ఈశాన్య దిశ వైపు పయనించనుంది. క్రమంగా అదే దిశలో కదులుతూ ఒడిశాలోని గోపాల్‌పూర్‌–చాంద్‌బాలీల మధ్య దక్షిణ పూరీకి సమీపంలో మూడో తేదీ మధ్యాహ్నం పెను తుపానుగానే తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. అనంతరం క్రమంగా పశ్చిమ బెంగాల్‌ మీదుగా పయనించి బంగ్లాదేశ్‌లో మే 5న వాయుగుండంగా బలహీనపడనుందని వివరించింది.


తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 205 కిలోమీటర్ల వేగంతో బలమైన పెనుగాలులు వీస్తాయని తెలిపింది. బుధ, గురు, శుక్రవారాల్లో పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్రల తీరాలకు ఆనుకుని గంటకు 165–195 కిలోమీటర్ల వేగంతో పెనుగాలుల ఉధృతి ఉంటుందని పేర్కొంది. అదే సమయంలో బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో గంటకు 60, శుక్ర, శనివారాల్లో 85–115 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. రానున్న మూడు రోజులు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని తీరప్రాంతాల్లో గంటకు 170–200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు విధ్వంసం సృష్టించనున్నాయి. కాగా, గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశాలో అతిభారీ వర్షాలు (20 సెం.మీలకు పైగా) కురవనున్నాయి. తుపాను గాలుల ధాటికి చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, ఇళ్లు కూలిపోయే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. పెను తుపాను ఏకంగా నాలుగు రోజుల పాటు (ఈనెల 3 వరకు) కొనసాగుతుండడంవల్ల నష్ట తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ముప్పు!
ఫొని పెను తుపాను ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ప్రభావం చూపనుందని ఐఎండీ తెలిపింది. గురు, శుక్రవారాల్లో ఈ రెండు జిల్లాల్లో పెనుగాలుల ఉధృతితో పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈనెల 4 వరకు తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై ఉంటుందని వివరించింది. 

అల్లకల్లోలంగా సముద్రం
పెను తుపాను ప్రభావంతో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారుతుంది. కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడనున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, తమ బోట్లను సురక్షితంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఐఎండీ సూచించింది. మరోవైపు.. పెను తుపాను తీవ్రత దృష్ట్యా విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నంబరు, కాకినాడలో 4, గంగవరం పోర్టులో 5వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement