
ఔను.. ‘రియల్’ వెంచరే!
ఊహించిందే నిజమయ్యింది. రాజధాని పేరిట రైతుల నుంచి వేలాది ఎకరాలు సమీకరిస్తున్న ప్రభుత్వం... ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనుందని...
సీఆర్‌డీఏ ‘భూముల కేటాయింపు విధానం’తో బట్టబయలు
* సర్కారు ఆధీనంలోనే 10,000 ఎకరాల భూమి
* రైతుల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం..
* భూముల ధర నిర్ధారణకు
* సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ అధ్యక్షతన కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఊహించిందే నిజమయ్యింది. రాజధాని పేరిట రైతుల నుంచి వేలాది ఎకరాలు సమీకరిస్తున్న ప్రభుత్వం... ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనుందని ‘సాక్షి’ తొలినుంచీ చెబుతూనే ఉంది. ఇప్పుడదే నిజమైంది. సీఆర్‌డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ) రూపొందించిన ‘భూముల కేటాయింపు విధానం’ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
రాజధాని రైతుల నుంచి సమీకరించిన భూములతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనుంది. పరిశ్రమలు, వాణిజ్య అవసరాల పేరిట ఏకంగా 10,000 ఎకరాలను తన ఆధీనంలో ఉంచుకోవాలని రాష్ర్టప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూమిని జోన్‌లు, ప్రాంతాల వారీగా గుర్తించి వచ్చే పది సంవత్సరాల్లో వివిధ రంగాలకు విక్రయించనున్నారు. పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పర్యాటక, క్రీడల రంగాలకు ఈ భూములను సీఆర్‌డీఏ కేటాయిస్తుందని భూ కేటాయింపుల విధానంలో పేర్కొన్నారు. భూ కేటాయింపులను మూడు కేటగిరీలుగా సీఆర్‌డీఏ వర్గీకరించింది. ఫ్రీ హోల్డింగ్ (సర్వహక్కులు కల్పించడం) లేదా 66 ఏళ్లు లేదా 99 ఏళ్ల లీజుపై భూముల కేటాయించనున్నారు.
అధిక ఆదాయం పేరుతో ‘రియల్’ వ్యాపారం
తొలి కేటగిరీలో భూములను రియల్ ఎస్టేట్‌కు, గృహాలకు, వాణిజ్య అవసరాలకు వేలం పాటలతో విక్రయించడం ద్వారా వీలైనంత ఎక్కువ ఆదాయం పొందాలని నిర్దేశించుకున్నారు. అంటే ఇది తమకు నచ్చిన వారికి, నచ్చిన విధంగా కేటాయించే ఎత్తుగడ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి లాక్కొన్న రాష్ర్టప్రభుత్వం ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనున్నట్లు బహిరంగంగానే ప్రకటించినట్లయింది.
ఇక రెండో కేటగిరీలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన ఆధారంగా భూములు కేటాయిస్తారని చెబుతున్నారు. ఈ కేటాయింపులు ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా ఉంటాయని అంటున్నారు. ఈ కేటాయింపుల ద్వారా ఆయా భూముల చుట్టుపక్కల ఉన్న సీఆర్‌డీఏ భూముల ధరలకు ఎక్కువ ధర వచ్చేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు, బీమా కంపెనీలకు, స్టాక్ ఎక్స్చేంజీలకు, ఆర్థిక సంస్థలకు, కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాలకు ఈ కేటగిరీలో భూ కేటాయింపులు చేస్తారు.
అలాగే పరిశోధన సంస్థలు, ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలు, ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలు, కాలేజీలు, డీమ్డ్ యూనివర్శిటీలకు, లాభదాయకమైన వైద్య సదుపాయాలకు, లాభదాయకమైన మెడికల్ కాలేజీలకు, అలాగే పర్యాటక రంగంలో లేజర్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, మెడికల్ టూరిజం, హెరిటేజ్ సంబంధిత రంగాలకు, క్రీడలకు భూ కేటాయింపులు చేస్తారు. ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్‌వేర్, టెక్స్‌టైల్స్, బిల్డింగ్ మెటీరియల్, లాజిస్టిక్స్, మీడియా సంస్థలకు, క్రీడల శిక్షణ అకాడమీలకు, న్యాయ రంగానికి, లా యూనివర్శిటీకి, ప్రభుత్వ రంగ సంస్థలకు భూములను కేటాయిస్తారు. వాణిజ్యపరమైన హోటల్స్, రిటైల్, లాభదాయకమైన స్కూల్స్, ఇంధన స్టేషన్లకు భూములను పెట్టుబడి, ఉద్యోగాల కల్పన ఆధారంగా కేటాయిస్తారు.
విద్య, వైద్య రంగాలకు రాయితీలు
మూడో కేటగిరిలో సేవల సంబంధిత వైద్య, విద్య, క్రీడా రంగాలతో పాటు గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు రాయితీలపై భూములను కేటాయిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన రంగాలకు కేంద్ర ప్రభుత్వ ‘అందరికీ ఇళ్లు’ పథకం కింద భూమిని రాయితీపై కేటాయిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, హైకోర్టు, శానససభ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సహకార గృహ నిర్మాణ సొసైటీలకు కూడా రాయితీలిస్తారు.
ఇలావుండగా భూముల ధరను నిర్ధారించేందుకు సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయనున్నారు. భూమి ధర నిర్ధారణలో సహకరించేందుకు ధరల నిర్ధారణ కమిటీ అవసరమైన నిపుణులను, కన్సల్టెంట్లను నియమించుకుంటుంది. కమిటీ నిర్ధారించిన ధరలకు సీఆర్‌డీఏ ఆమోదం తెలుపుతుంది. సీఆర్‌డీఏ ఆధీనంలో ఉంచే భూమి ధరను మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకోసారి మార్చి-సెప్టెంబర్ మధ్య సవరిస్తారు.