
సాక్షి, విజయవాడ : ఏపీలో యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కెఎస్.జవహర్ రెడ్డి అన్నారు. మంగళవారం 58 మంది డిశ్చార్జ్ అయ్యారని, ఇప్పటివరకు 1,056 కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. ఇది శుభపరిణామమని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇతర రాష్టాల నుంచి వచ్చిన వారందరినీ క్వారంటైన్ కేంద్రాల్లోనే ఉంచామని తెలిపారు.
కోయంబేడు మార్కెట్‌కు వెళ్లిన వారిలో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఇప్పటివరకు లక్షా 91 వేల 874 పరీక్షలు నిర్వహించామని జవహర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 1.07 శాతం, దేశంలో 4.02శాతంగా ఉందన్నారు. ఏపీలో రికవరీ రేటు 51.49 శాతం, కాగా దేశంలో 31.86 శాతంగా ఉందన్నారు.