కరెంటుపై కరోనా ఎఫెక్ట్‌

Corona effect on Power Sector - Sakshi

తగ్గిన గృహ విద్యుత్‌ వినియోగం

ఏసీలు ఆపేస్తున్న ప్రజలు.. ఫ్రిజ్‌ వాటర్‌కూ దూరం

గ్రామాల్లో చెట్ల కిందే కాలక్షేపం.. దేశమంతటా ఇదే పరిస్థితి  

సాక్షి, అమరావతి: విద్యుత్‌ వినియోగంపైనా కరోనా ప్రభావం పడింది. గృహ విద్యుత్‌ వినియోగంలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. శీతల ప్రాంతాల్లో ఉంటే వైరస్‌ త్వరగా వ్యాప్తి చెందుతుందనే ప్రచారం నేపథ్యంలో ఏసీల వాడకం చాలా వరకూ తగ్గించారు. గ్రామీణ ప్రజలైతే మిట్ట మధ్యాహ్నం తప్ప మిగిలిన సమయాల్లో ఇంటి ఆవరణలో చెట్ల కిందే ఉంటున్నారని అనంతపురం జిల్లా ఎలక్ట్రికల్‌ ఏఈ చక్రధర్‌ తెలిపారు. అక్కడక్కడా ఫ్రిజ్‌లు కూడా ఆపేశారు. చల్లటి పదార్థాలు, కూలింగ్‌ వాటర్‌కు సైతం దూరంగా ఉంటున్నారు. దేశమంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

లాక్‌డౌన్‌ నాటి నుంచీ..
► రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం సాధారణంగా రోజుకు 170 మిలియన్‌ యూనిట్లు కాగా.. ఏప్రిల్, మే నెలల్లో గరిష్టంగా 210 మిలియన్‌ యూనిట్లు దాటుతుందని అంచనా.
► కానీ.. ప్రస్తుతం రోజుకు సగటున 160 మిలియన్‌ యూనిట్లు దాటడం లేదు. గృహ వినియోగం 20 శాతం పైగా తగ్గింది. 
► రాష్ట్రంలో 1.45 కోట్ల మంది విద్యుత్‌ వినియోగదారులున్నారు. ఇందులో 92.24 లక్షల మంది గృహ వినియోగదారులే.
► గృహ విద్యుత్‌ వినియోగం రోజుకు 58 మిలియన్‌ యూనిట్లు ఉంటుంది. ఇందులో చాలా ఇళ్లల్లో నెలవారీ విద్యుత్‌ వినియోగం 100 యూనిట్ల లోపే.
► నెలకు 225 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే కుటుంబాలు 43.56 లక్షల వరకు ఉండగా.. కుటీర పరిశ్రమలు సైతం ఇందులోనే ఉన్నాయి. 
► కుటీర పరిశ్రమలు కూడా నడవడం లేదు కాబట్టి ఈ కేటగిరీ విద్యుత్‌ వాడకం తగ్గింది.
► పరిశ్రమలు, వాణిజ్య వినియోగ కనెక్షన్లు 10 లక్షల వరకూ ఉన్నాయి. ఈ రెండు కేటగిరిల్లో వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. 

డిమాండ్‌ పడిపోతోంది
ఏప్రిల్‌లో రోజుకు 210 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంటుందని అంచనా వేశాం. పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోగా.. గృహ విద్యుత్‌ వినియోగం తగ్గింది. అన్ని కేటగిరీల్లోనూ ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తోంది.
–  శ్రీకాంత్‌ నాగులాపల్లి,విద్యుత్‌ శాఖ కార్యదర్శి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top