కార్పొరేషన్‌కు కాంట్రాక్ట్ భారం | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌కు కాంట్రాక్ట్ భారం

Published Fri, Sep 5 2014 3:50 AM

Contract Corporation burden

సాక్షి, నెల్లూరు: అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల పుణ్యమా అని నెల్లూరు నగర పాలకసంస్థకు కాంట్రాక్ట్ ఉద్యోగులు భారమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నేతలు చెప్పిందే తడవుగా నిబంధనలు పాటించక ఇబ్బడిముబ్బడిగా కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. నాటి అధికారపార్టీ నేతల ఆదేశాలతో అప్పటి కమిషనర్ ఇష్టానుసారం తాత్కాలిక ఉద్యోగులను నియమించారు.
 
 ఇప్పుడు అధికార టీడీపీ నేతలు తాము చెప్పిన వారందరికీ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. మరోవైపు కొందరు అధికారులు అధికార పార్టీ నేతలు,దళారులతో కుమ్మక్కై  అందినకాడికి దండుకుని కాంట్రాక్ట్ సిబ్బంది నియామకాలు సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా ఉద్యోగాల కోసం అధికారపార్టీ నేతల జాబితా చాంతాడంత అయ్యింది.
 
  ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్‌కు తాత్కాలిక ఉద్యోగనియామకాలు మరింత భారంగా మారాయి.  ఇప్పటికే కార్పొరేషన్ పరిధిలోని హెల్త్ విభాగంలో 800 మంది, ఇంజనీరింగ్ విభాగంలో 300 మంది, 70 మంది వరకూ కంప్యూటర్ ఆపరేటర్లతో కలిపితే 1170 మంది  కాంట్రాక్ట్ సిబ్బంది పనిచేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నది కేవలం 900 మంది మాత్రమే. ఇది కార్పొరేషన్‌కు మరింత భారంగా మారింది. తాజాగా టీడీపీ అధికారం చేపట్టడం, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇక్కడి వారే కావడం, ఇక వైఎస్సార్‌సీపీ  అభ్యర్థిగా గెలిచిన మేయర్ అబ్దుల్ అజీజ్ అధికారపార్టీ తీర్థం పుచ్చుకోవడంతో నగరపాలకలో  కాంట్రాక్ట్ ఉద్యోగాలకు మరింత డిమాండ్ పెరిగింది.
 
 ఇప్పటికే గ్రూపులుగా విడిపోయి ఉన్న అధికారపార్టీ నేతలు కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం పోటీలు పడి కమిషనర్‌పై ఒత్తిళ్తు తెస్తున్నట్లు తెలుస్తోంది. ‘అధికారం మాదే. ఉద్యోగాలు ఇవ్వకుంటే మీసంగతి తేలుస్తాం’ అంటూ కొందరు నేతలు బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. మరోవైపు కార్పొరేటర్లు సైతం కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. వీరేకాక ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలు వసూలు చేసిన కొందరు నేతలు, దళారులు సైతం కార్పొరేషన్‌లో ఉద్యోగాల కోసం  అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు.
 
 కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం నెలకు రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకూ జీతం ఇస్తుండటంతో వీటికి పోటీ పెరిగింది. దీంతో కొందరు నేతలు,దళారులు అభ్యర్థుల నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ వసూళ్లు చేస్తున్నారు. మొత్తంగా కాం్రట్రాక్ట్ ఉద్యోగాల కోసం వచ్చిన జాబితా చాంతాడంత అయినట్లు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఓ కీలక ఉద్యోగి పేర్కొన్నారు. ఇప్పటికే  కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు నెలకు  రూ.90 లక్షలు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. సిబ్బంది నియామకాలు భారమని తెలిసినా అధికారులు మాత్రం అవేవీ చెప్పక ఇష్టానుసారం నియామకాలు సాగించారు. వీరిలో ఎక్కువ మంది  కార్పొరేషన్ కార్యాలయానికి మొక్కుబడిగా వచ్చి నెలజీతం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎవరు పని చేస్తున్నారో, ఎవరు చేయడంలేదో కూడా అధికారులకు తెలియని పరిస్థితి నెలకొంది.
 
 విచారణ జరిపిస్తే
 వాస్తవాలు వెలుగులోకి:
 కార్పొరేషన్‌లో ఎంతమంది తాత్కాలిక ఉద్యోగులున్నారు? వారి విధులు ఏమిటి? ఎవరు ఏఏ విభాగాల్లో పని చేస్తున్నారు? వారికి నిజంగా పని ఉందా? వారిని ఎప్పుడు ఎవరు నియమించారు?లాంటి విషయాలపై అధికారులు సమగ్ర విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకావముంది.
 
  అవసరం లేకున్నా సిబ్బందిని నియమించి జీతాలు చెల్లించడం దారుణం. అసలే నిధుల లేమితో అభివృద్ధి పనులు అంతంతమాత్రంగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు  చేపట్టడం దారుణం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి  సమగ్రవిచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
 

Advertisement
Advertisement