రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాష్ట్రాన్ని విభజిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక తీవ్రస్థాయిలో మండిపడింది.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాష్ట్రాన్ని విభజిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక తీవ్రస్థాయిలో మండిపడింది. తెలుగు ప్రజల మధ్య విభజన చిచ్చు రగిల్చారని, అయితే.. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రస్థాయిలో ఉండటం వల్లే ప్రస్తుతానికి తెలంగాణ అంశంపై కేబినెట్ నోట్ ఆగిందని సమితి రాష్ట్ర సమన్వయకర్త లక్ష్మణరెడ్డి అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకు మద్దతు తెలిపినట్లు తమకు తెలిసిందని, అలాగే.. ఇప్పటికే సీపీఎం, మజ్లిస్ పార్టీలు కూడా సమైక్యాంధ్రకు మద్దతు తెలిపాయని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రానికి తెలుగుదేశం పార్టీ 2008లో ఇచ్చిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ కూడా సీడబ్ల్యుసీ చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు. సీమాంధ్రలోని ఎంపీలు, మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని, అసెంబ్లీని సమావేశపరిచి సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా తీర్మానాన్ని చేసి ఢిల్లీకి పంపాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే తీసుకోవాలని ఆయన అన్నారు.