ఎకరాకు రూ.3 లక్షలు | Sakshi
Sakshi News home page

ఎకరాకు రూ.3 లక్షలు

Published Thu, Jun 28 2018 2:36 PM

Commotion Fix On CJFS Lands PSR Nellore - Sakshi

జిల్లాకే తలమానికం కానున్న దామవరం విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో అధికార టీడీపీ నేతల దందా శ్రుతిమించింది. ఇప్పటికే ప్రభుత్వ భూములను కబ్జా చేసి, రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి రూ.కోట్ల పరిహారం పేరుతో జేబులు నింపుకున్న తమ్ముళ్లు ఆఖరికి భూ లబ్ధిదారులను వదలకుండా దోచుకునేందుకు స్కెచ్‌ వేశారు. ఎకరాకు రూ.3 లక్షల కమీషన్‌ కొట్టితే కానీ.. పరిహారం రాదని పరోక్షంగా చెబుతున్న టీడీపీ నేతల దోపిడీకి అధికారులు కూడా నాలుగేళ్లుగా అండగా నిలిచారు. పరిహారం పంపిణీ చేసి భూములను స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితులు అనివార్యం కావడంతో టీడీపీ నేతలు, అధికారులు లబ్ధిదారులపై ఒత్తిడి పెంచుతున్నారు.

కావలి: దగదర్తి విమానాశ్రయానికి చేపట్టిన భూసేకరణ ప్రక్రియ తెలుగు తమ్ముళ్లకు కల్పతరువుగా మారింది. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు ప్రకటన వెలువడంతో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూబాగోతానికి తెరలేపారు. గత ప్రభుత్వ హయాంలో విమానాశ్రయం ఏర్పాటుకు తొలుత ఇక్కడ 2,486.86 ఎకరాలు అవసరం అవుతాయని, ఆ మేరకు భూమి సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 3,407.77 ఎకరాలు సేకరించాలని ప్రతిపాదించారు. ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో విమానాశ్రయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇదే అదనుగా టీడీపీ నేతలు భూదందాకు తెగబడ్డారు. పరిహారం కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించారు. రెవెన్యూ అధికారులను ప్రలోభపెట్టి ఏకంగా రెవెన్యూ రికార్డులనే తారుమారు చేశారు. దగదర్తి భూదందా జిల్లాలోనే అతిపెద్ద భూకుంభకోణంగా వెలుగులోకి వచ్చింది.

భూదందాతో భూసేకరణ కుదింపు
విమానాశ్రయం భూముల్లో టీడీపీ నేతల భూదందాతో అప్పటి కలెక్టర్‌ జానకి రంగంలోకి దిగారు. అక్రమాలకుపాల్పడిన రెవెన్యూ అధికారులను సస్పెండ్‌ చేశారు. భూ ముల వివాదాలకు తావు లేకుండా భూసేకరణ మొత్తాన్ని 1,370 ఎకరాలకు తగ్గించి భూ దందాకు తెరదించారు. అర్హులైన జాబితాను సిద్ధం చేసి 2015లో అప్పటి కలెక్టర్‌ భూ పరిహారం పంపిణీకి చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 1,058 ఎకరాలకు పరిహారం ఇచ్చి, స్వాధీ నం చేసుకున్నారు. ఇంకా 321 ఎకరాలు సేకరించాల్సి ఉంది.

సీజేఎఫ్‌ఎస్‌ భూములపై నేతల కన్ను
భూదందాతో రూ.కోట్లు దోచుకోవాలని టీడీపీ నేతలు చేసిన కుట్రలు పటాపంచెలు కావడంతో ఆఖరుకు సీజేఎఫ్‌ఎస్‌ భూములపై వారి కన్ను పడింది. సీజేఎఫ్‌ఎస్‌ భూ లబ్ధిదారులందరూ పేదలు కావడంతో కనీసం వారి భూముల ద్వారానైనా లబ్ధిపొందాలని దోపిడీకి ప్లాన్‌ చేశారు. ఇక మిగిలిన 321 ఎకరాల భూముల్లో సున్నపుబట్టి వద్ద సర్వే నంబర్‌ 335లో 119 ఎకరాలు సీజేఎఫ్‌ఎస్‌ భూములు ఉన్నాయి. 102 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో ఆరుగురికి 6 ఎకరాలకు అప్పటి కలెక్టర్‌ జానకి పరిహారం పంపిణీ చేశారు. మిగిలిన 96 మందికి సంబంధించి 113 ఎకరాలకు పరిహారం పంపిణీ చేయాల్సి ఉంది. ఈ భూములను అనుభవిస్తున్న వారిలో ఎక్కువ మంది దళితులే. ఎకరాకు రూ.13 లక్షలు చొప్పున వారికి ప్రభుత్వం నష్టపరిహారం పంపిణీ చేయాల్సి ఉంది.

పోస్ట్‌ డేట్‌ చెక్కులిస్తేనే..
113 ఎకరాలు సీజేఎఫ్‌ఎస్‌ భూములకు పరిహారం పంపిణీకి టీడీపీ నేతలు తమకు కమీషన్‌ ఇవ్వాలని పేచీ పెట్టారు. దీంతో నాలుగేళ్లుగా పరిహారం అందక లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. ఎకరాకు ఎంతో కొంత పరిహారం ఇవ్వకపోతే డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదని బెదిరింపులకు దిగుతున్న టీడీపీ నేతలకు అధికారులు కూడా అండదండలు అందజేస్తున్నారనే ఆరోపణలకు నాలుగేళ్లుగా జరిగిన కాలయాపనే నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా విమానాశ్రయానికి వచ్చే నెలలో శంకుస్థాపన చేసే అవకాశాలు ఉండడంతో ఇటు అధికారులు, అటు అధికారులు సీజేఎఫ్‌ఎస్‌ లబ్ధిదారులపై ఒత్తిడి పెంచారు. ఎకరాకు రూ.3 లక్షల చొప్పున తమ పేర్లతో ముందుగా చెక్కులు ఇస్తేనే అధికారుల ద్వారా నష్టపరిహారం అందించే ఏర్పాట్లు చేస్తామని టీడీపీ నాయకులు తెగేసి చెబుతున్నారు. చెక్‌లు ఇవ్వని వారికి మాత్రం నష్టపరిహారం చెక్‌లు జారీ చేసేది లేదని స్వయంగా అధికారుల సమక్షంలోనే టీడీపీ నాయకులు భూమి హక్కుదారులకు స్పష్టం గా తేల్చి చెప్పారు. ఈ భూముల వ్యవహారం పీటముడిగా మారడంతో విమానాశ్రయం నిర్మాణా నికి అవసరమైన భూసేకరణ ప్రక్రియకు అవరోధంగా ఉండటంతో అధికారులు సైతం అధికార టీడీపీ నాయకులు చెప్పినట్లుగా సర్దుకుపోవాలని లబ్ధిదారులకు చెబుతుండటం గమనార్హం. ఈ పరిణామాలతో హక్కుదారులైన పేదలు లబోదిబోమంటున్నారు.

హక్కుదారుల పేర్లతోనేచెక్‌లు జారీ చేస్తాం
విమానాశ్రమానికి అవసరమైన సీజేఫ్‌ఎస్‌ భూములకు సంబంధించి తమ రికార్డుల్లో హక్కుదారులుగా ఉన్న వారి పేర్లతోనే నష్టపరిహారం కింద చెక్‌లు జారీ చేస్తాం. ప్రైవేట్‌గా జరిగే వ్యవహారాలతో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇందులో ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు.– ఇస్కా భక్తవత్సలరెడ్డి, ఆర్డీఓ, కావలి

Advertisement

తప్పక చదవండి

Advertisement