హింసకు పాల్పడితే కాల్పులే! | committed to violence shootings | Sakshi
Sakshi News home page

హింసకు పాల్పడితే కాల్పులే!

Apr 5 2014 2:29 AM | Updated on Sep 2 2017 5:35 AM

స్థానిక ఎన్నికల్లో హింసకు పాల్పడేవారిపై నేరుగా కాల్పులు జరిపేందుకు పోలీసులకు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

కర్నూలు, న్యూస్‌లైన్: స్థానిక ఎన్నికల్లో హింసకు పాల్పడేవారిపై నేరుగా కాల్పులు జరిపేందుకు పోలీసులకు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారం గడువు ముగిసింది. కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 35 మండలాల్లో ఈనెల 6వ తేది మొదటి విడత పోలింగ్ జరగనుంది.
 
రెండో విడత 11వ తేదీ ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని 19 మండలాల పరిధిలో పోలింగ్ నిర్వహించనున్నారు.  పోలింగ్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తే అలాంటి వారిపై  అన్‌లాఫుల్ యాక్టివిటీస్(ప్రివెన్షన్ యాక్ట్ 1967, (2008 సవరణ)) చట్టం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు లేదా ఓటర్లను బెదిరించి వారి ఓటు హక్కుకు భంగం కలిగించేవారిపై ఇటీవల సవరించిన ఎస్సీ, ఎస్టీ నివారణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని ఎస్పీ రఘురామిరెడ్డి క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు.
 
విధి నిర్వహణలో ఉండే సిబ్బందిపై దాడులకు పాల్పడటం, బల ప్రయోగం ద్వారా దాడి చేయడం, హత్యాయత్నానికి పాల్పడటం వంటి సంఘటనలను తీవ్రంగా పరిగణించాలని ఆదేశాలిచ్చారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై తీవ్రవాద కార్యకలాపాలు, దేశ ద్రోహులు, ఉగ్రవాదులు, నక్సలైట్లు తదితర సంఘ విద్రోహ శక్తులపై ఉపయోగించే అన్‌లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ 1967 చట్టం ప్రకారం సెక్షన్ 15(బి) రెడ్ విత్ 16(బి) కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు.
 
ఈ కేసుల్లో నేరం రుజువైతే సాధారణ శిక్షలతో పోలిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి. జీవిత ఖైదు శిక్షను కూడా కోర్టు విధించే అవకాశం ఉంటుందని ఎస్పీ తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, పత్రాలు ఎత్తుకుపోవడం, ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం వంటి ఘటనలను పోలీస్‌శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది.
 
రంగంలోకి షాడోపార్టీలు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌కు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో జిల్లా కేంద్రం నుంచి పారా మిలిటరీ బలగాలు మండలాలకు చేరుకున్నాయి. సీఆర్‌పీఎఫ్, ఏపీఎస్పీ సిబ్బంది సేవలను ఎన్నికల బందోబస్తుకు వినియోగిస్తున్నారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 57 మంది సీఐలు, 170 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, 776 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 2686 మంది కానిస్టేబుళ్లు, 880 మంది హోంగార్డులు, ఏపీఎస్పీ 8 ప్లటూన్లతో రిటైర్డ్ సీఆర్‌పీఎఫ్, సైనిక పోలీసు అధికారులను ఎన్నికల బందోబస్తు విధులకు నియమించారు.
 
స్పెషల్ స్ట్రయికింగ్, స్ట్రయికింగ్ ఫోర్స్‌తో పాటు షాడో పార్టీలను ఇప్పటికే రంగంలోకి దింపారు. జిల్లాలో మొత్తం 1183 మంది లెసైన్స్ కలిగిన ఆయుధాలుండగా, బ్యాంకులకు రక్షణగా ఉపయోగించే తుపాకులు మినహాయింపు ఇప్పటి వరకు 1104 ఆయుధాలను జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ హెడ్ క్వార్టర్స్‌తో పాటు ఆయా పోలీస్ స్టేషన్‌లలో డిపాజిట్లు చేసే విధంగా చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement