‘చదువుల దేవాలయం ఆంధ్రా యూనివర్సిటీ’ | CM YS Jagan Speech At Andhra University Alumni Meet | Sakshi
Sakshi News home page

‘ఉద్యోగం వచ్చేలా డిగ్రీ కోర్సుల్లో మార్పులు’

Dec 13 2019 7:48 PM | Updated on Dec 13 2019 8:00 PM

CM YS Jagan Speech At Andhra University Alumni Meet - Sakshi

సాక్షి, విశాఖపట్నం : చదువులే మనల్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్తాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో శుక్రవారం జరిగిన ఆంధ్రా యూనివర్సీటీ పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఆంధ్ర యూనివర్సిటీ చదువుల దేవాలయం అని కొనియాడారు. ప్రపంచానికే మేధావులను అందించిన గొప్ప చరిత్ర ఏయూది అని ప్రశంసించారు. అలాంటి యూనివర్సీటీలో 549 టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ప్రభుత్వంగా తల దించుకోవాల్సిన పరిస్థితి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే విద్యావ్యవస్థలో పలు మార్పులు చేపట్టామని సీఎం జగన్‌ అన్నారు. ప్రతి పాఠశాలలోనూ 9 రకాల కనీస వసతులు ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 45వేల పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం మూడు దశల్లో నిర్వహిస్తున్నామన్నారు. మెదటి దశలో 15వేల స్కూళ్లలో మరుగుదొడ్లు, త్రాగు నీరు, బ్లాక్‌ బోర్డు లాంటి మౌలిక వసతులు కల్పించబోతున్నామని తెలిపారు.

వచ్చే ఏడాది ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెడుతున్నామని సీఎం జగన్‌ తెలిపారు. ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ విద్యావ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. ఇంగ్లీష్‌ ల్యాబ్‌లు, బ్రిడ్జ్‌కోర్సులు ఏర్పాటు చేసి టీచర్లకు ట్రైనింగ్‌ ఇస్తామని చెప్పారు. ఉన్నత విద్యలో కూడా సమూల మార్పులు తీసుకొస్తామని సీఎం జగన్‌ అన్నారు. ఉద్యోగాలు వచ్చేలా డిగ్రీ, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో మార్పులు చేస్తామన్నారు. డిగ్రీ స్థానంలో డిగ్రీ ఆనర్స్‌గా మార్చి, ఒక ఏడాది ప్రాక్టికల్‌ శిక్షణ అందిస్తామన్నారు. బీకామ్‌ లాంటి కోర్సులకు మూడేళ్లు చదువులు, ఒక ఏడాది ప్రాక్టికల్‌ శిక్షణ ఉండేలా మార్పులు చేస్తామని తెలిపారు.

ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు 100శాతం ఫీజు రియింబర్స్‌మెంట్‌ అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు విద్యాదీవెన పథకం కింద రూ.20వేలు అందిస్తున్నామని గుర్తుచేశారు. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలంటే పూర్వ విద్యార్థుల సంఘాల పాత్ర కీలకం అన్నారు. విద్యార్థులకు సహాయపడేలా యూనివర్సీటీలకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఏయూ పూర్వ విద్యార్థుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం నుంచి రూ.50కోట్లను యూనివర్సీటీకి అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం రీడింగ్ రూమ్, జీఎం ఆర్ బ్లాక్ హాస్టల్ భవనాలకు శంఖుస్థాపన చేశారు.  ఈ కార్యక్రమంలో టెక్‌ మహేంద్ర సంస్థ సీఈవో సీపీ గుర్నానీ, గ్రంథి మల్లిఖార్జునరావు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌, శిశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జీఎంఆర్‌ అధినేత, అలుమ్ని వ్యవస్థాపక చైర్మన్‌ జీఎం రావు, ఏయూ వీసీ ప్రొఫెసర్‌ ప్రసాదరెడ్డి, మాజీ డీజీపీ, గంగవరం పోర్ట్‌ సీఈవో సాంబశివరావు, మాజీ వీసీ ప్రొఫెసర్‌ బీల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement