థ్యాంక్యూ.. సీఎం జగన్‌ | CM YS Jagan Mohan Reddy Helps Cancer Patient Hema | Sakshi
Sakshi News home page

జగనన్న మేలు మరచిపోలేం

Dec 4 2019 1:07 PM | Updated on Dec 4 2019 1:07 PM

CM YS Jagan Mohan Reddy Helps Cancer Patient Hema - Sakshi

చిన్నారి హేమ తల్లిదండ్రులు దుర్గాప్రసాద్, చిన్నమ్ములు

‘తొలిసారి ఆడబిడ్డ పుడితే .. ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందంటారు. మేమూ అలాగే అనుకున్నాం. పుట్టిన కొద్దికాలానికే బిడ్డ కంటి చూపు తగ్గిపోవడంతో ఆందోళన చెంది ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశాం. ఆఖరికి హైదరాబాదు ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి వెళితే కేన్సర్‌ అంటూ తేల్చారు. వైద్యానికి డబ్బుల మాట అటుంచితే, కనీసం ఖర్చులకు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం.. ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు.  చక్కగా ఆడుకోవాల్సిన చిన్నారి ఎవరో ఒకరి చేయి ఆసరా లేకపోతే వస్తువులను గుద్దుకుని పడిపోయేది’.  అంటూ కడియం మండలం కడియపులంకలోని దోసాలమ్మ కాలనీకి చెందిన కేన్సర్‌ బాధిత చిన్నారి భీమిని హేమ తల్లిదండ్రులు దుర్గాప్రసాద్, చిన్నమ్ములు చెప్పుకొచ్చారు.

(రాజమహేంద్రవరం రూరల్‌): క్యాన్సర్‌తో బాధపడుతున్న కడియం మండలం కడియపులంక, దోసాలమ్మకాలనీకి  చెందిన భీమిని హేమకు వ్యాధి నయమయ్యేవరకూ వైద్యం చేయించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించడంతో చిన్నారి తల్లిదండ్రులు దుర్గాప్రసాద్, చిన్నమ్ములు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల తమ చిన్నారికి చికిత్స కోసం ఇప్పటికే ఉన్నదంతా ఖర్చు చేసేశారు. తమ సొమ్ముతోపాటు, దాతలు ఇచ్చిన డబ్బును కూడా చిన్నారి వైద్యానికి వెచ్చించారు. ప్రస్తుతం హేమకు వైద్యం చేయించేందుకు వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విషయం తెలిసి సీఎం జగన్‌ వెంటనే స్పందించి చిన్నారికి వైద్యం చేయించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా సీఎంవో నుంచి ప్రత్యేకాధికారి దుర్గాప్రసాద్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం దుర్గాప్రసాద్, చిన్నమ్ములను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల వీర్రాజు (బాబు), పార్టీ నాయకులు ఈలి గోపాలం తదితరులు కలిసి మాట్లాడారు. సీఎం జగన్‌ భరోసా ఇవ్వడం పట్ల సదరు కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, జగన్‌కు రుణపడి ఉంటామన్నారు. కడియం మండలం ఆరోగ్యమిత్ర నాగిరెడ్డి రామకృష్ణ చిన్నారి తండ్రి దుర్గాప్రసాద్‌ నుంచి ఇప్పటి వరకు జరిగిన వైద్యానికి సంబంధించిన విరాలను సేకరించారు. ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులతోపాటు, సీఎం కార్యాలయానికి వివరాలు పంపించాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారని రామకృష్ణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement