తుని: నాడు తండ్రి..నేడు తనయుడు..

CM YS Jagan Mohan Reddy Has Kept The Promise - Sakshi

9 గంటల ఉచిత విద్యుత్‌తో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పు

రాత్రివేళ కాపలా తప్పిందంటున్న అన్నదాతలు

ట్రయిల్‌రన్‌లో అధికారులు నిమగ్నం

సాక్షి, తుని రూరల్‌(తూర్పు గోదావరి): సార్వత్రిక ఎన్నికల ముందు నవరత్నాల పథకాల్లో భాగంగా వ్యవసాయానికి నిరంతరం విద్యుత్‌ సరఫరా చేస్తామన్న హామీని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. ఆదిశగా  ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా సోమవారం నియోజకవర్గంలో ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలు వరకు, ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటలు వరకు ఉచిత విద్యుత్‌ సరఫరాకు ట్రాన్స్‌కో అధికారులు ట్రయిల్‌రన్‌ నిర్వహించారు. ట్రయిల్‌రన్‌ నిర్వహించి ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లలో మార్పులు గమనిస్తున్నట్టు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. ఏ విధమైన ఒత్తిడి ఉందో ఉన్నత అధికారులకు నివేదిక ఇవ్వనున్నట్టు తుని రూరల్‌ ఏఈ కామేశ్వర శాస్త్రి తెలిపారు. నియోజకవర్గంలో 3,593 వ్యవసాయ విద్యుత్‌ బోరుబావులు ఉన్నాయి. 

అమలులో జగన్‌ వాగ్దానం
నవరత్నాల పథకాల్లో అమలు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్‌ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు ట్రాన్స్‌కో అధికారులు 9గంటల ఉచిత విద్యుత్‌ సరఫరాకు ట్రయిల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఏడు గంటలు ఉచిత విద్యుత్‌ అందించి రైతుల గుండెళ్లో నిలిచిపోయారు.

దివంగత రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రైతులకు అండగా నిలిచేందుకు పగలే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు రాత్రివేళల్లో సరఫరా అయ్యే ఉచిత విద్యుత్‌ కోసం పంట పొలాల్లో కష్టపడుతూ, విద్యాద్ఘాతానికి గురై ఎంతో మంది కర్షకులు మృత్యువాత పడ్డారు. అటువంటి సంఘటనలు తన ప్రభుత్వంలో జరగకుడదన్న సంకల్పంతో పగలే రెండు షిఫ్టులుగా ఉచిత విద్యుత్‌ను సరఫరాకు ఆదేశించారు. 

ఉచిత విద్యుత్‌ సరఫరా చేయడంతో...
తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయాలన్న రైతులు కల నెరవేరనుంది. ఉదయం ఐదు గంటల నుంచి మొదటి  షిప్టు, పది గంటల నుంచి రెండో షిప్టు ఉచిత విద్యుత్‌ను తొమ్మిది గంటలు సరఫరా చేయనున్నారు. అనుకున్నట్టు రెండు మూడు రోజులు ట్రయిల్‌ రన్‌లు నిర్వహించి అవాంతరాలు సవరించి పట్టపగలే వ్యవసాయ విద్యుత్‌ సరఫరా చేసి సాగుకు కొత్త కళ తీసుకురానున్నారు. తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్‌ సరఫరా సమర్థవంతంగా అమలయితే వేలాది ఎకరాలకు సాగునీరు లభించడంతో మెట్ట భూములు సస్యశ్యామలమవుతాయిన రైతులు పేర్కొన్నారు.

నాడు తండ్రి, నేడు తనయుడు
రైతులు కష్టాలను కళ్లారా చూసిన వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి 2004లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఏడు గంటలు అందిస్తే, ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పగలే తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్‌ అమలకు చర్యలు చేపట్టడం వ్యవసాయం, రైతులపై తండ్రికొడుకులకు ఉన్న నిబద్ధత తెలియజేస్తుంది.
– నాగం దొరబాబు, రైతు, చామవరం

కరెంట్‌ కష్టాలు తీరినట్టే
పగలనక రాత్రనక ఉచిత విద్యుత్‌ ఎప్పుడు సరఫరా అవుతుందాని పంట పొలాల్లో కాపలాకాసే రోజులు పోయాయి. వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్‌ అందించడం సహసమే. రైతులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను పాదయాత్రలో చూసిన ముఖ్యమంత్రి జగన్‌ు రైతులకు కరెంట్‌ కష్టాలను తీర్చారు.
– పరవాడ అప్పారావు, రైతు, కుమ్మరిలోవ

వాణిజ్య సాగుకు ఊతం
పట్టపగలే వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్‌ అందించడం వాణిజ్య పంటల సాగుకు ఊతం ఇచ్చి నట్టయ్యింది. సూక్ష్మ పరికరాలు ఏర్పాటు చేసుకుంటే ఎనిమిది నుంచి పది ఎకరాలకు సాగునీరు అందనుంది. పగలే భూగర్భ జలాలను తోడుకోవడం వల్ల రాత్రులు పొలాల్లో కష్టాలు పడాల్సిన పనిలేదు.
– దాట్ల సతీష్‌ వర్మ, రైతు, తేటగుంట

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top