మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌

CM Ys Jagan Mohan Reddy Foundation Stone For Medical College in Eluru - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి(ఏలూరు): ఏలూరు నగరంలో రూ. 266 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఆధునిక ప్రభుత్వ వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఏలూరు నగరంలో పర్యటిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత టీడీపీ పాలకులు ఏలూరులో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని బీరాలు పలికినా ఆచరణలో మొండిచేయి చూపారు. అయితే సీఎం వైఎస్‌ జగన్‌ వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో ఏలూరు జిల్లా ఆసుపత్రిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు.

దీనిలో భాగంగా ప్రభుత్వం మెడికల్‌ కళాశాల భవనాల నిర్మాణానికి ఇప్పటికే రూ.266 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ మెడికల్‌ కాలేజీలో తొలుత 100 సీట్లు కేటాయిస్తారు. దీని ఏర్పాటుకు మెడికల్‌ కౌన్సిల్‌ సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో 25 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే సేకరించి, కాలేజీ నిర్మాణానికి సిద్ధంగా ఉంచగా, అవసరమైతే మరికొంత స్థలాన్ని సేకరించేందుకు మంత్రి నాని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కళాశాల ఏర్పాటుతో జిల్లాలోని విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి రానుండడంతో పాటు, పేద ప్రజలకు ఆధునిక వైద్యసేవలు మరింత చేరువకానున్నాయి. వైద్య రంగంలో మరిన్ని పరిశోధనలు, ఆధునిక వైద్య సౌకర్యాలు జిల్లా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

రూ.266 కోట్ల నిధులు మంజూరు 
మెడికల్‌ కళాశాలకు రాష్ట్ర సర్కారు రూ.266 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019–2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిధులను వినియోగించుకునేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్టోబర్‌ 1న జీవోనెంబర్‌ 114ను ప్రభుత్వం విడుదల చేసింది. వైద్య కళాశాల ప్రారంభంలో మొదటి ఏడాది 100 సీట్లు భర్తీ చేస్తారు. నాలుగేళ్ళకాలంలో వైద్య విద్య అభ్యసించే విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన, హాస్టల్‌ ఏర్పాటుకు భారీఎత్తున భవంతులను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటారు. ఎంసీఐ నిబంధనల మేరకు మొత్తం 380 మంది విద్యార్థులకు గాను హాస్టల్‌ భవనాన్ని నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.  
 


ప్రభుత్వ స్టాల్స్‌ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా.. 
ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి 518 బెడ్లతో అన్ని వసతులు కలిగి ఉంది. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల మేరకు ఏలూరులో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు ఏ విధమైన ఆటంకాలు లేవు. ఇప్పటికే జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో మౌలిక సదుపాయాలు, ఆధునిక వైద్య పరికరాలు, సేవలు, బెడ్స్, స్థలం, మెడికల్‌ బృందం ఎంసీఐ నిబంధనల మేరకు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. జనరల్‌ మెడిసిన్, గైనకాలజీ, జనరల్‌ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, ఆప్తాల్మజీ, టీబీ అండ్‌ సీడీ, స్కిన్‌ అండ్‌ ఎస్‌టీడీ, ట్రామాకేర్, ఐసీయూ ఇలా అనేక విభా గాలు ప్రజలకు సేవలు అందిస్తున్నా యి. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లా కేంద్ర ఆసుపత్రిని సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. టీడీపీ హయాంలో ఐదేళ్ళ పాటు ఏలూరు లో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని చెప్ప డం మినహా చేతల్లో విఫలమయ్యారు. అదిగో నిధులు, ఇదిగో పనులు అంటూ ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో చతికిలపడ్డారు. నిధులు మంజూరు అయ్యాయని, త్వరలోనే భవనాల నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పి చివరకు ముఖం చాటేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top