
అధికారమే ధ్యాస.. అక్రమాలే శ్వాస
ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారమే ధ్యాస, అక్రమాలే శ్వాసగా కొనసాగుతున్నారని ఎమ్మెల్సీ ఎం.సుధాకర్.....
► సీఎం తీరుపై ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు ఎద్దేవా
► గద్దె దింపితేనే ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అని విమర్శ
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారమే ధ్యాస, అక్రమాలే శ్వాసగా కొనసాగుతున్నారని ఎమ్మెల్సీ ఎం.సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శుక్ర, శనివారాల్లో జరిగిన మహానాడును ప్రస్తావిస్తూ నిజంగా ఎన్టీఆర్‌ను ప్రేమించే వారైతే ఆ సభలకు వెళ్లకూడదని అభిప్రాయపడ్డారు. పార్టీ తనదంటూ వ్యవస్థాపకుడినే బహిష్కరించిన ఘనత చంద్రబాబుదన్నారు. ఎన్టీఆర్‌కు చేసిన అవమానం మరిచిపోయారా అంటూ మహానాడుకు వెళ్లిన వారిని ఉద్దేశించి ప్రశ్నించారు.
ఎన్టీఆర్ చావుకు నూటికి నూరుపాళ్లు చంద్రబాబే కారణమని ఆరోపించారు. ఆయన చనిపోయినప్పుడు ఫతే మైదాన్‌లో అడుగుపెట్టే ధైర్యం చాలక బయటే ఉండిపోయారని గుర్తు చేశారు. తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన హరికృష్ణ లోపలికి పిలుచుకువచ్చారన్నారు. అన్నా క్యాంటీన్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టి నవ్వులపాలు చేస్తున్నారని విమర్శించారు.
ఆయన్ను గద్దె దింపితేనే ఎన్‌టీరామారావుకు అసలైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, పీసీసీ కార్యదర్శి సర్దార్ బుచ్చిబాబు, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు సలాం, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.