గవర్నర్‌తో చంద్రబాబు భేటీ

గవర్నర్‌తో చంద్రబాబు భేటీ - Sakshi


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. రాత్రి ఏడు గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లిన చంద్రబాబు సుమారు 40 నిమిషాల పాటు అక్కడ ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వ వ్యవహారశైలిపై ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇటీవలి కాలంలో స్వచ్ఛ తెలంగాణ, హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా పలు సభలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చేసిన ప్రసంగాలు, ఏపీ ఉన్నత విద్యామండలికి తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు తాళాలు వేయటం వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయని తెలిసింది.



గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. ఇప్పటికే ఖాళీగా ఉన్న నాలుగు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను చంద్రబాబు ఎంపిక చేశారు. అభ్యర్ధులుగా ఎంపికైన వారిలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీ జనార్ధనరావు, బీద రవిచంద్రయాదవ్, గౌనివాని శ్రీనివాసులు ఉన్నారు. వారి జాబితాను గవర్నర్‌కు సీఎం అందించారని చెబుతున్నారు. వచ్చే నెల 6 న రాజధానికి భూమి పూజ ముహూర్తం విషయాన్ని గవర్నర్‌కు తెలియజేశారు. రాష్ర్టంలో వడగాడ్పుల వల్ల ప్రజలు మృతి చెందుతున్న నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు చేపట్టిన కార్యక్రమాలు వివరించారు.



గవర్నర్ కోటాలో నాలుగో అభ్యర్ధిగా బీద

నామినేటెడ్ కోటాలో శాసనమండలికి నాలుగో అభ్యర్ధిగా పార్టీ తరపున నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్‌ను నామినేట్ చేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన పేరును ఖరారు చేయటంతో పాటు సమాచారం అందించారు. అందుకు ఆయన చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top