అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ ముందు చట్టాలు కొల్లేరులో కలుస్తున్నాయి.
అటవీ అధికారులపై బూతు పురాణం
అనుమతులు లేకుండా రోడ్డు నిర్మాణం
మరో కోమటిలంక రోడ్డుగా పెదయాగనమిల్లి
కైకలూరు : అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ ముందు చట్టాలు కొల్లేరులో కలుస్తున్నాయి. అధికారం అండ, అందునా పెద్దాయన ఆశీస్సులు ఉండటంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అన్యాయాన్ని ఎదిరించే అధికారులను బండబూతులు తిడుతున్నారు. ఎదుటివారి భయమే పెట్టుబడిగా రెచ్చిపోతున్నారు. ‘కొల్లేరు కాంటూరా.. గింటూరా.. తవ్వుకోండి.. ఎవడొస్తాడో నేను చూస్తాన’ంటూ అభయం ఇస్తున్నారు. ఇన్నాళ్లూ పశ్చిమగోదావరికే పరిమితమైన చింతమనేని దౌర్జన్యకాండ కళకళలాడే కృష్ణా సరిహద్దులపై పడింది.
కొల్లేరు గ్రామాల్లో రహదారి చిచ్చు... : కృష్ణాజిల్లా మండవల్లి మండలం చింతపాడు, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని పెదయాగనమిల్లి గ్రామాల మధ్య రహదారి నిర్మాణ వివాదం కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున సాగింది. స్నేహభావంతో మెలిగే రెండు కొల్లేరు గ్రామాల మధ్య.. రహదారి చిచ్చు రాజేసింది. ఆందోళనతో దద్దరిల్లిన ఆవేశం అంతలోనే చల్లారింది. ఇంతలో అటవీ శాఖ అధికారులు నిబంధనల దస్త్రాన్ని దులిపారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. చివరకు చింతమనేని ఎత్తుగడే పైచేయిగా నిలిచింది. చింతపాడు నుంచి పెదయాగనమిల్లి వరకు 3.75 కిలోమీటర్లకు పశ్చిమగోదావరి నుంచి ప్రభుత్వ నిధులు రూ.2 కోట్ల 15 లక్షలు కేటాయించారు. నిర్మాణ పనులను అటవీ అధికారులు అడ్డుకోవడంతో చింతమనేని సీన్‌లోకి వచ్చారు. సోమవారం పెదయాగనమిల్లి, చింతపాడుకు చెందిన మహిళలు, పురుషులతో ముందుగా చింతపాడు వద్ద టెంట్ వేశారు. రెండు జిల్లాల కొల్లేరు సంఘ అధ్యక్షుడు సైదు సత్యనారాయణ, మరికొందరు పెద్దలు ముందు వరసలో కూర్చున్నారు. పశ్చిమగోదావరికి చెందిన పీఆర్ ఈఈ ప్రకాశ్‌నాయుడు, డీఈ దుర్గాప్రసాద్, ఏలూరు రూరల్ ఎస్సై సుభాష్ చేరుకున్నారు. అటవీ అధికారులు ఒక్కరూ లేరు. ఇంతలో కారులో వచ్చిన చింతమనేని ప్రజల ఎదురుగా అటవీ శాఖ ఏసీఎఫ్ వినోద్‌కుమార్‌ను ఫోన్‌లో ‘రారా చూసుకుందాం... దమ్ముంటే నీ సిబ్బందితో రా.. నువ్వో నేనో తేల్చుకుందాం..’ అంటూ సినీ డైలాగ్‌లు చెప్పడంతో కొల్లేరు ప్రజలు కేరింతలు కొట్టారు. యథావిధిగా ఆయన వెళ్లిపోవడం.. రోడ్డు పనులు మొదలు పెట్టడం జరిగిపోయింది. ఒక్క అటవీశాఖ అధికారీ అక్కడకు రావడానికి సాహసించలేదంటే.. అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆ కేసు ఏమైంది...
కోమటిలంక రోడ్డు నిర్మాణ సమయంలో గతేడాది నవంబరు ఏడున చింతమనేని తమపై దౌర్జన్యం చేశారని అటవీ శాఖ డీఆర్వో జి.ఈశ్వరరావు టౌన్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే అధికార పార్టీ నాయకులు పోలీసులపై ఒత్తిళ్లు తీసుకొచ్చారు. దీంతో ఇక్కడి పోలీసులు చట్టానికే కొత్త అర్థాన్ని చెప్పారు. అటవీ శాఖ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయరని స్పష్టం చేశారు. దీంతో ఆ కేసు బుట్టదాఖలా అయింది.