మంచమెక్కిన మన్యం

Child Deaths And Viral Fevers In East Godavari Tribal Area - Sakshi

మే నెలలో గర్భిణి, ముగ్గురు నవజాత శిశువుల మృతి

సకాలంలో వైద్యం అందని దుస్థితి పట్టించుకోని ప్రభుత్వం

రాజవొమ్మంగి (రంపచోడవరం): తూర్పు మన్యం రాజవొమ్మంగిని మాతాశిశు మరణాలు పట్టి పీడిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మూడు మాతా, మరో ఆరు శిశు మరణాలు సంభవించాయి. ఒక్క మే నెలలోనే ఓ నిండు గర్భిణి, మరో ముగ్గురు నవజాత శిశువులు మరణించారు. రక్తహీనత కారణంగా 8వ నెల గర్భిణి మృతశిశువుకు జన్మనీయడం గిరిజన ప్రాంతంలో తల్లిబిడ్డల ఆరోగ్య పరిస్థితిని తేటతెల్లం చేస్తుంది. గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్లను రాజవొమ్మంగి లేదా జడ్డంగి 24 గంటల తల్లీబిడ్డల ఆస్పత్రికి తీసుకువస్తుంటే.. అక్కడ చిన్నపిల్లల వైద్య నిపుణులు, అధునాతన వైద్య పరికరాలు, మందులు లేకపోవడంతో వారికి సకాలంలో వైద్యం అందడం లేదు. రాజవొమ్మంగి ఆస్పత్రిలోని వైద్యులు కాకినాడ జీజీహెచ్‌కు రిఫర్‌ చేస్తున్నారు. కాకినాడకు వారిని చేర్చేలోపుగా ప్రాణాలు విడుస్తున్నారు. లేదా చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మన్యంలో వైద్య సేవలు ఏరీతిలో ఉన్నాయనేది ఇట్టే అర్థమవుతుంది. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మాతాశిశు మరణాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గిరిజనులు కోరుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందని స్థానిక గిరిజన ప్రతినిధులు అంటున్నారు.

ముర్లవానిపాలేనికి చెందిన పప్పుల లోవకుమారికి పుట్టిన 3 నెలల మగశిశువు మే 3వ తేదీన ఊపిరి అందక కాకినాడ జీజీహెచ్‌లో మరణించింది.

మే 21వ తేదీన అప్పలరాజుపేట గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి చిన్ని ప్రేమజ్యోతి రాజవొమ్మంగి పీహెచ్‌సీలో తీవ్రమైన రక్తస్రావంతో మృత శిశువుకు జన్మనిచ్చింది. తీవ్ర రక్తహీనతతో బాధపడుతోన్న ఆమెను మే 9న పీహెచ్‌సీలో నిర్వహించిన జననీ సురక్ష యోజన వైద్య శిబిరంలో పరీక్షించారు. ఆమె కడుపులో బిడ్డకు ఎదుగుదల లేదని, వెంటనే పట్టణ ప్రాంతానికి వెళ్లి స్కానింగ్‌ చేయించుకోవాలని వైద్య నిపుణులు చెప్పారు. అయితే ఆమె కుటుంబానికి ఆర్థిక స్తోమత లేక స్కానింగ్‌ చేయించుకోలేదు. దీంతో కడుపులోనే బిడ్డ మరణించగా రెండు రోజుల తరువాత ఆమె మృత శిశువుకు జన్మనిచ్చింది.

మే 28వ తేదీన మద్దికొండ సుగుణ అత్తవారి ఇల్లు వై.రామవరం మండలం చవిటిదిబ్బల నుంచి పుట్టిల్లు రాజవొమ్మంగి మండలం వాతంగి వచ్చింది. ఇంతలో ఆమె చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైతే జడ్డంగి 24 గంటల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడు వైద్య నిపుణులు అందుబాటులో లేకపోవడంతో కింది స్థాయి వైద్య సిబ్బంది కాకినాడకు రిఫర్‌ చేసింది. అతడు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు.

మే 29వ తేదీనే మండలంలోని జి.కొత్తపల్లికి చెందిన నిండు గర్భిణి నందపు వెంకటలక్ష్మి కాకినాడలో చికిత్స పొందుతూ మరణించింది. అత్తిల్లు రంపచోడవరం సబ్‌ప్లాన్‌ ఏరియా బవురువాక గ్రామం నుంచి పుట్టిల్లు జి.కొత్తపల్లికి పురిటి కోసం వచ్చింది. పురిటినొప్పులతో గుర్రపు వాతం (ఫిట్స్‌) రావడంతో ఆమెను కుటుంబీకులు వెంటనే కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top