కమలం గూటికి చాగండ్ల! | chgandla narendranath joins in BJP soonly | Sakshi
Sakshi News home page

కమలం గూటికి చాగండ్ల!

Dec 16 2013 1:00 AM | Updated on Jul 7 2018 2:52 PM

కాంగ్రెస్ పార్టీ నాయకుడు చాగండ్ల నరేంద్రనాథ్ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం.

సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్:  కాంగ్రెస్ పార్టీ నాయకుడు చాగండ్ల నరేంద్రనాథ్ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో గత పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ స్థానం నుంచి పోటీ చేసిన విషయం విదితమే. సొంత పార్టీలో తన సేవలకు గుర్తింపు లేకపోవడంతో పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్టు స్వయంగా ఆయనే వెల్లడించారు. కాకపోతే ఏ పార్టీలోకి వెళుతున్నదీ త్వరలోనే చెబుతానన్నారు. ఇదిలా ఉండగా చాగండ్ల బీజేపీలోకి వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నట్టు ఆయన సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి. కమలనాథుల రాష్ట్ర నాయకులతో  సైతం చాగండ్ల వారం రోజులుగా విస్తృతంగా చర్చలు జరిపినట్టు సమాచారం. చాగండ్ల రాకపై బీజేపీ రాష్ట్ర నాయకులు, స్థానిక నేతలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

బీజేపీ అగ్ర నాయకురాలు సుష్మాస్వరాజ్ సమక్షంలో చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే మెదక్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు ఓవైపు కమలనాథులు, మరోవైపు నరేన్ ట్రస్ట్ కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. భారీ ఎత్తున నిర్వహించే బహిరంగ సభకు సుష్మాస్వరాజ్‌ను అహ్వానించేందుకు రాష్ట్ర కమిటీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ కీలకమనే అంశాన్ని సైతం ఈ ప్రాంత ప్రజలకు వివరించి రాజకీయ లబ్ధి పొందాలన్నది కూడా వారి ప్రయత్నం. ఈ క్రమంలో జాతీయ నాయకుల సమక్షంలో పార్టీలో చేరి ఎన్నికల ప్రచార పర్వాన్ని ప్రారంభించేందుకు నరేంద్రనాథ్ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు విద్యాసాగర్‌రావు, దత్తాత్రేయ, జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు సుష్మాస్వరాజ్‌కు నరేంద్రనాథ్ చేరిక విషయాన్ని వివరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తానికి నరేంద్రనాథ్ బీజేపీలో చేరడం దాదాపుగా ఖరారైనట్టేనని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement