రెండోరోజూ చెరుకూరి దీక్ష.. వైద్యానికి నో!

Cherukuri Satyanarayana Continues his Hunger Strike - Sakshi

సాక్షి, విజయవాడ : చెరుకూరి ఓల్గా అర్చరీ అకాడమీ చీఫ్‌ కోచ్ చెరుకూరి సత్యనారాయణ దంపతులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండోరోజుకు చేరుకుంది. చెరుకూరి సత్యనారాయణ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తుండగా.. ఆయన భార్య చెరుకూరి కృష్ణకుమారి ఇంట్లో దీక్షను చేస్తున్నారు. గుణదల స్మశానవాటికలోని తన కుమారుడు లెనిన్ సమాధి వద్ద దీక్ష చేస్తున్న చెరుకూరి సత్యనారాయణను మంగళవారం సాయంత్రం బలవంతంగా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. పోలీసులు ఆయన దీక్ష భగ్నం చేసి.. బలవంతంగా ఆస్పత్రికి తరలించినా.. ఆస్పత్రిలో ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు.

అర్జున అవార్డు గ్రహీత, ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ  తనను, తన కుటుంబాన్ని అవమానించారని, ఆమె, ఆమె తండ్రి తమకు క్షమాపణ చెప్పే వరకు దీక్ష విరమించేది లేదని ఆయన చెప్తున్నారు. దీక్షలో ఉన్న ఆయన వైద్యానికి నిరాకరిస్తున్నారు. జ్యోతిసురేఖను తాను ఎప్పుడు డబ్బులు అడగలేదని, తాను రూ. 15 లక్షలు అడిగినట్టు ఆమె అబద్ధాలు చెప్తున్నారని చెరుకూరి సత్యనారాయణ అంటున్నారు. తమ పేరు చెప్పి.. ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్లకు రావాల్సిన డబ్బు తీసుకున్నారని, ఆమె శిక్షణ తీసుకుంది తమ వోల్గా ఆర్చరీ సెంటర్‌లోనేనని ఆయన తెలిపారు.

వివాదమిది..
ఈ నెల 3న ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో తనకు కోచ్‌గా చెరుకూరి సత్యనారాయణను చూపిస్తూ  రూ.15 లక్షల మంజూరు చేయడాన్ని జ్యోతి సురేఖ ఖండించిన విషయం తెలిసిందే. తనకు ఏనాడు ఆయన కోచ్‌గా వ్యవహరించలేదని ఆమె స్పష్టం చేశారు. తన కోచ్‌లు జె.రామారావు, జీవన్‌జ్యోత్‌సింగ్‌ అని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా చెరుకూరి సత్యనారాయణ అడ్డుకున్నారని, దీంతో పెట్రోలియం స్పోర్ట్స్‌ బోర్డ్‌ తరఫున ఆడాల్సి వచ్చిందని తెలిపారు. 2013లోనే ఓల్గా ఆర్చరీ అకాడమీ నుంచి బయటకు వచ్చినట్లు ఆమె వివరణ ఇచ్చారు. మరోవైపు జ్యోతిసురేఖకు బేసిక్‌ కోచ్‌ను తానేనని చెరుకూరి సత్యనారాయణ వాదిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top