విలేజ్‌ మాల్స్‌ ఓ విఫల ప్రయోగం

Chandranna Village Malls Failure Scheme Guntur - Sakshi

నిత్యావసర సరుకుల ధరలు బయటకన్నా ఎక్కువే

వినియోగదారుల ఆదరణ కరువు

నిర్వాహకులకు ఖర్చులు     పోను మిగిలేది గోరంత..

దరఖాస్తు చేసిన డీలర్ల     వెనుకంజ

చంద్రన్న విలేజ్‌ మాల్స్‌... ప్రభుత్వం ఆర్భాటంగా ఆరంభించింది. కాని చిత్తశుద్ధి లోపంతో అటు వినియోగదారులకు కొరగాకుండా, ఇటు నిర్వాహకులైన డీలర్లకు ప్రయోజనం లేకుండా ఉన్నాయి. ఆదాయం లేని మాల్స్‌ ఏర్పాటుకు రేషన్‌ డీలర్లు వెనుకంజ వేస్తున్నారు. వెయ్యికి పైగా దరఖాస్తుదారులు ముందుకొచ్చినా ఆర్నెల్లలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కేవలం వందకు మించి మాల్స్‌ ఏర్పాటు చేయలేకపోవడం ఇందుకు నిదర్శనం. హోల్‌సేల్‌ మార్కెట్‌ ధరలను పరిగణనలోకి తీసుకోకుండా, సరుకుల  ధరల నిర్ణయం, విధివిధానాల్లో డీలర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం ఇందుకు కారణాలు. ఇలాగే కొనసాగితే చంద్రన్న విలేజ్‌ మాల్స్, నాటి గృహమిత్ర పథకంలాగే చరిత్రకు పరిమితమయ్యే ప్రమాదం ఉంది.

తెనాలి:రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 6,500 చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, వీటిని నిర్వహించే డీలర్లకు నెలకు రూ.10–15 వేల ఆదాయం కల్పించడం తమ ధ్యేయంగా రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గత మార్చి 30న తెనాలిలో చంద్రన్న విలేజ్‌ మాల్‌ ప్రారంభ సభలో ప్రకటించారు. మంత్రి చేసిన ప్రకటన వాస్తవరూపం దాల్చనేలేదు. నిజానికి 2017 డిసెంబరులో ఆరంభించిన ఈ పథకంలో ఇప్పటికి కేవలం 100 మాల్స్‌ మాత్రమే నడుస్తున్నాయి. మాల్‌లో అన్ని రకాల సరుకులను బయట మార్కెట్‌ కన్నా 5–10 శాతం తక్కువ ధరలతో విక్రయించేలా చూస్తామని చెప్పిన దానికి భిన్నంగా, నూనెలు మినహా నిత్యావసరాలు దాదాపుగా బయట మార్కెట్‌కన్నా ఎక్కువగా ఉండడంతో వినియోగదారుల ఆదరణ కోల్పోతున్నాయి. కందిపప్పు కిలో బయ ట మార్కెట్లో రూ.63కు విక్రయిస్తుంటే విలేజ్‌ మాల్స్‌లో రూ.69కు అమ్ముతున్నారు. ఈ లెక్కన అర కిలో ప్యాకెట్‌ను రూ.37కు ఇస్తున్నారు. అంటే రెండుసార్లుగా రెండు అరకిలోల కందిపప్పును కొనుగోలు చేసే పేద వినియోగదారుడు రూ.74 చెల్లించాల్సి వస్తోంది. సబ్బులు, రవ్వలు మినహా ఇతర సరకుల ధరలు మార్కెట్‌కు మించి రూ.5–12 శాతం హెచ్చుగా ఉంటున్నాయి.  

మాల్‌ ఏర్పాటు వ్యయం, సరుకుల అమ్మకాల్లో ఇచ్చే కమీషనుపై చెప్పిన మాటలకు ఆచరణకు పొంతన లేకపోవడంతో నష్టానికి వ్యాపారం ఎలా చేస్తామంటూ, డీలర్లు సణుగుతున్నారు. పైలెట్‌ ప్రాజెక్టుగా 2017 డిసెంబరులో ఆరంభించినపుడు 2 నెలలపాటు డీలరుకు నూనెలపై 3.4 శాతం, ఇతర సరుకులపై 8 శాతం కమీషను ఇచ్చారు. ఇదేదో బాగుందనుకుంటూ రాష్ట్రమంతా డీలర్లు ముందుకొచ్చారు. మార్చి నుంచి ప్రారంభించిన విలేజ్‌మాల్స్‌కు పప్పులు, నూనెలపై ప్యాకెట్ల లెక్కన కిలోకు రూపాయి, ఇతర సరుకులపై 3.5 నుంచి 4 శాతం కమీషనునే ఇస్తున్నారు. డీలర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా 50 శాతం మార్జిను తగ్గించేశారు. దీనితో నెలలో రూ.2 లక్షల విలువైన సరుకులు అమ్మితే రూ.8 వేలు వస్తే, అన్‌లోడింగ్‌ చార్జీలు, అదనపు అద్దె, కరెంటు బిల్లు, సహాయకుడి వేతనం, పేపర్‌ రోల్స్‌ ఖర్చులు లెక్కించుకుంటే మిగిలేదేమీ ఉండడం లేదని డీలర్ల ఆవేదన.

రేషను దుకాణాన్ని చంద్రన్న విలేజ్‌మాల్‌గా తీర్చిదిద్దడానికయే వ్యయంలో 25 శాతం డీలరు, 25 శాతం ప్రభుత్వం, మిగిలిన 50 శాతం రిలయన్స్‌/ ఫ్యూచర్‌  కంపెనీ భరిస్తుందని చెప్పారు. డీలరు వాటాను ముద్ర రుణంగా ఇప్పిస్తామని నమ్మబలికారు. తర్వాత తన వాటా లేకుండా ప్రభుత్వం చేతులు దులుపుకొంది. దీంతో 50 శాతం ఖర్చును డీలర్లే భరించాల్సివచ్చింది. తీరా ఇప్పుడు చంద్రన్న బోర్డు, ర్యాక్‌లు మాత్రమే రిలయన్స్‌ సప్లయి చేస్తుందని, మిగిలిన ఖర్చంతా డీలరే భరించాలనీ, కావాలంటే ఆ మొత్తాన్ని రిలయన్స్‌ సంస్థ 8 శాతం వడ్డీకి సమకూరుస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ మార్పుపై డీలర్లకు ఎలాంటి సమాచారం లేదంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top