సీఎం చంద్రబాబు హామీలు అమలుచేయాలి | Chandrababu fulfill guarantees | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబు హామీలు అమలుచేయాలి

Jun 23 2015 3:01 AM | Updated on Sep 3 2017 4:11 AM

సీఎం చంద్రబాబు హామీలు అమలుచేయాలి

సీఎం చంద్రబాబు హామీలు అమలుచేయాలి

రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్‌లో సోమవారం ధర్నా జరిగింది...

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక డిమాండ్
గాంధీనగర్ :
రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్‌లో సోమవారం ధర్నా జరిగింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా నిరుద్యోగులు నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లగుడు గోవిందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి ఇస్తామని నమ్మబలికి, ఓట్లు వేయించుకుని నిరుద్యోగులకు మొండి చేయిచూపారని విమర్శించారు. ఏడాది కాలంలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో 1.38 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీకి నోచుకోవడం లేదన్నారు. నోటిఫికేషన్లు విడుదల కాక, వయోపరిమితి ముగుస్తుండటంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని వివరించారు. తక్షణమే నిరుద్యోగ భృతి అందజేయాలని, ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మంత్రుల ఇళ్లు ముట్టడి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయిం చినట్లు చెప్పారు.

అనంతరం ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీతం సాంబశివరావు, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఆకారపు రవిచంద్ర మాట్లాడుతూ నోటిఫికేషన్లు జారీ చేయకుండా నిరుద్యోగుల వయోపరిమితి పెంచి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. కొన్నేళ్లుగా నియామకాలు నిలిచిపోయాయన్నారు. ఎందరో నిరుద్యోగులు అర్హత ఉన్నా నోటిఫికేషన్లు రాకపోవడంతో వయోపరిమితి మించిపోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి తానిచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో నిరుద్యోగ యువతీ  యువకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement