అంత ధీమా ఉంటే.. ప్రజా తీర్పు కోరండి | Challenge Congress to debate on development, governance: Venkaiah | Sakshi
Sakshi News home page

అంత ధీమా ఉంటే.. ప్రజా తీర్పు కోరండి

Aug 26 2013 2:44 AM | Updated on Sep 1 2017 10:07 PM

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేంద్రంలో మూడోసారి కూడా నూటికి నూరు శాతం అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అంత ధీమా ఉంటే..

 సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేంద్రంలో మూడోసారి కూడా నూటికి నూరు శాతం అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అంత ధీమా ఉంటే.. ప్రజల తీర్పు కోరాలని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు సవాల్ చేశారు. ‘‘అసమర్ధత, అవినీతి, అక్రమాలలో ఆరితేరినందుకు జనం మళ్లీ పట్టంకడతారా?’’ అని ఆయన ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు ఆదివారం హైదరాబాద్‌లో పార్టీ నేతలు వై.రఘునాథ్‌బాబు, ఎన్.రామచంద్రరావు, శ్రీధర్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశాన్ని అన్ని విధాలా దివాలా తీయించిన ఘనత యూపీఏకే దక్కిందని ధ్వజమెత్తారు.
 
ధరలు ఆకాశాన్నంటాయని, ఆర్ధిక లోటు ఆందోళనకర స్థాయికి చేరిందని, పారిశ్రామిక ఉత్పత్తి తిరోగమన దిశలో ఉందని, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని.. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని చరిత్రలోనే చూడలేదని విమర్శించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను వదిలిపెట్టి.. బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ నరేంద్రమోడీని అపఖ్యాతి పాల్జేయటమెలా, లౌకికవాదం ముసుగులో ఓట్లు దండుకోవటమెలా అనే రెండు సూత్రాల కార్యక్రమాన్ని కాంగ్రెస్ అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ ఇచ్చామని చెబుతున్న హక్కులన్నీ ఆదేశిక సూత్రాల్లో ఉన్నవేనన్నారు.
 
 అనంతపురంలో పదెకరాలు, మహబూబ్‌నగర్‌లో 15 ఎకరాలున్న రైతులకన్నా.. హైదరాబాద్‌లోని కిళ్లీ బడ్డీ యజమానే నయమన్నారు. రాజ్యసభలో తాను తెలంగాణపై మాట్లాడిన అంశాలపై ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని వెంకయ్య పేర్కొన్నారు. తెలంగాణపై తమ వైఖరిలో మార్పు లేదని, సిద్ధాంతపరమైన నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు. ‘టీడీపీతో పొత్తు ఉంటుందా?’ అని ప్రశ్నించగా.. పొత్తులపై చర్చించలేదని.. ఏవైపు నుంచి ఎటువంటి ప్రతిపాదనలు లేవని బదులిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 272కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు.
 
 బీసీ సబ్‌ప్లాన్‌పై నేటి నుంచి బీజేపీ దీక్ష
 బీసీ సబ్‌ప్లాన్ కోసం సోమ, మంగళవారాల్లో బీజేపీ నేతలు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద దీక్ష చేపట్టనున్నారు. పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, కె.లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ తదితరులు దీక్షలో పాల్గొంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement