కిష్టంపేటలో దారుణహత్య | Sakshi
Sakshi News home page

కిష్టంపేటలో దారుణహత్య

Published Wed, Feb 5 2014 3:33 AM

brutal murder

 రాయికల్, న్యూస్‌లైన్: జిల్లాలో ఫ్యాక్షన్ సంస్కృతి పెరిగిపోతోంది. కళ్లలో కారం కొట్టి, వేటకొడవళ్లతో తరిమితరిమి నరికిచంపుతున్న ఘటనలు ఇటీవల బాగా జరుగుతున్నాయి. కొద్ది రోజుల కిందట వీణవంక మండలం నర్సింగాపూర్‌లో మాజీ ఎంపీటీసీని వేటకొడవళ్లతో నరికి చంపిన ఘటన మరువకముందే ఇప్పుడు రాయికల్ మండలం కిష్టంపేటలోనూ అలాంటి ఘటనే జరిగింది.
 
 కిష్టంపేటకు చెందిన కచ్చకాయల మోహన్(35)ను మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు కళ్లలో కారం కొట్టి, వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. మోహన్  ద్విచక్రవాహనంపై పొలం వద్దకు వెళ్లి సాయంత్రం తిరిగివస్తుండగా గ్రామ శివారులోని ఎల్లమ్మ ఆలయం ఎదురుగా ఉన్న ఓ మామిడితోటలో గుర్తుతెలియని వ్యక్తులు కాపుకాసి అడ్డుకున్నారు.
 
 తమ వెంట తెచ్చుకున్న కారంపొడి అతడి కళ్లలో చల్లి వేటకొడవళ్లతో దారుణంగా నరికారు. తల, ముఖంపై, కడుపులో విచక్షణా రహితంగా పొడిచారు. ఓ కత్తిని అతడి పొట్టలోనే వదిలేశారు. కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే జరిగిన ఈ సంఘటన కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారం మేరకు డీఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, జగిత్యాల రూరల్ సీఐ వెంకటరమణ, రాయికల్ ఎస్సై రామూనాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు భూతగాదాలు, పాతకక్షలే కారణమని భావిస్తున్నారు.
 
 సంఘటన స్థలంలో దుండగులు ఏపీ 15 క్యూ 3473 నంబర్ గల ద్విచక్రవాహనం వదిలివెళ్లారు. ఈ వాహనం ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా మృతుడి భార్య వసంత అడ్డుకుంది. తనకు గ్రామంలోని పది మందిపై అనుమానం ఉందని, తన భర్తను వారే పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తూ... అనుమానితుల పేర్లను ఎస్సైకి వివరించింది.

 వారిని వెంటనే శిక్షించాలని, అప్పటివరకు తన భర్త మృతదేహాన్ని తీసుకెళ్లొద్దంటూ అడ్డుకుంది. దోషులను పట్టుకుంటామని, న్యాయం చేస్తామని సీఐ నచ్చజెప్పడంతో ఆమె ఆందోళన విరమించింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మోహన్‌కు భార్య వసంత, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సంఘటన స్థలాన్ని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. కాగా, మృతుడికి కొందరితో భూ తగాదాలు ఉన్నాయని, ఓ హత్యకేసులో జైలుకెళ్లి వచ్చాడని స్థానికులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement