సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో ఉరకలు వేస్తోంది. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు రెచ్చగొట్టేలా ఉండటంతో సమైక్యవాదులు నిరసనల హోరు ఉధృతం చేశారు.
సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో ఉరకలు వేస్తోంది. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు రెచ్చగొట్టేలా ఉండటంతో సమైక్యవాదులు నిరసనల హోరు ఉధృతం చేశారు. జిల్లాలో 54వ రోజు ఉద్యమం సమరస్ఫూర్తితో సాగింది. ఉద్యమంలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 30 వరకు విద్యాసంస్థలు మూతపడనున్నాయి.
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్‌బాబు ఇచ్చిన పిలుపు మేరకు బంద్ పాటిస్తున్నట్లు సీమాంధ్ర విద్యాసంస్థల జేఏసీ ప్రకటించింది. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగుల జేఏసీ ఈ నెల 26 నుంచి వచ్చేనెల మొదటి తేదీ వరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. మరోవైపు ట్రెజరీ ఉద్యోగులు తమపై వస్తున్న ఒత్తిళ్లకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఎటువంటి ఒత్తిళ్లు తీసుకొచ్చినా బిల్లులు చేయబోమని ట్రెజరీ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది.
మార్మోగిన సమైక్య రైతు శంఖారావం..
ముదినేపల్లి మండలంలోని బొమ్మినంపాడులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సమైక్య రైతు శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై భారీగా తరలివచ్చారు. విభజన వల్ల రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ మండల కన్వీనర్ నిమ్మగడ్డ భిక్షాలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 47వ రోజుకు చేరాయి. ఉపాధ్యాయులు రోడ్డు ఆటలు ఆడి నిరశనలు తెలిపారు.
అవనిడగడ్డలో అశ్వరావుపాలెం రైతులు దీక్ష చే శారు. మైలవరం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షల శిబిరం వద్ద మహిళలు ఆంధ్రప్రదేశ్ చిత్రపటాన్ని వేసి ముగ్గులతో అలంకరించారు. కురుమద్దాలి ఎస్‌వీఎస్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రహదారిపై రాస్తారోకో చేశారు. నూజివీడు పట్టణంలోని జంక్షన్ రోడ్డులో దీక్షలు 27వ రోజుకు చేరాయి. నందిగామలో ఉద్యోగులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనాసాగరం వద్ద సుమారు 40 నిమిషాల పాటు రాస్తారోకో చేశారు. జాతీయ రహదారిపై వరి నాట్లు వేస్తూ నిరసన తెలిపారు. పట్టణానికి చెందిన ముస్లిం యువకుడు షేక్ ఖాజా ఆధ్వర్యంలో గాంధీ సెంటర్‌లో శునకానికి వినతిపత్రం ఇస్తూ నిరసన తెలిపారు. మచిలీపట్నం కోనేరుసెంటర్‌లో కొనసాగుతున్న రిలేదీక్షలో ఎల్‌ఐసీ ఎస్సీ, ఎస్టీ వెల్‌ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు పాల్గొన్నారు.
ఐస్‌గడ్డపై గంటసేపు నిరసన..
న్యాయశాఖ జేఏసీ నాయకుడు పీవీ ఫణికుమార్ మచిలీపట్నంలోని జిల్లా కోర్టు ప్రధాన గేటు ఎదుట ఐస్‌బ్లాక్‌పై గంటసేపు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో హనుమాన్‌జంక్షన్‌లో చేపట్టిన రిలేదీక్షలు 30వ రోజుకు చేరాయి. విద్యార్థులు రహదారిపై మానవహారం ఏర్పాటుచేశారు. తిరువూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఎన్జీవోలు, ఉపాధ్యాయులు తిరువూరు జెడ్పీ బాలికోన్నత పాఠశాల ఆవరణలోని జాతిపిత మహాత్మాగాంధీ, అమరజీవి పొట్టిశ్రీరాములు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాలకు సమైక్యాంధ్ర కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు.
పెడనలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు 35వ రోజుకు చేరాయి. కైకలూరులో జేఏసీ నాయకులు జాతీయ రహదారిపై చెస్, క్యారమ్స్ ఆటలు ఆడి నిరశన వ్యక్తం చేశారు. పెనుగంచిప్రోలులో వ్యవసాయ మహిళా కూలీలు స్థానిక పాత సినిమా హాల్ సెంటర్‌లో కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. గుడ్లవల్లేరులో వైఎస్సార్ సీపీ నేత, ఉలవలపూడి గ్రామ సర్పంచి నందమూరి ధనలక్ష్మి నాయకత్వాన పలువురు రిలే దీక్షలకు కూర్చున్నారు. పెడన పట్టణ రజకులు జాతీయ రహదారిపై చాకిరేవు మీద బట్టలు ఉతుకుతూ, వాటిని రోడ్డుపైనే ఆరవేస్తూ నిరసన తెలిపారు.
నూజివీడు లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీలతో ర్యాలీ నిర్వహించారు. ఉయ్యూరులో క్రైస్తవులు విభజన ఆపాలంటూ ప్రత్యేక పార్ధనలు జరిపారు. జగ్గయ్యపేటలో నారాయణ ఈ టెక్నో స్కూల్‌విద్యార్థులు 105 మీటర్ల పొడవు ఉన్న జాతీయ జెండాతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. గుడివాడ పట్టణంలో మునిసిపల్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు రోడ్డుపై పండ్లు అమ్మి నిరసన తెలిపారు. విజయవాడ ఆటోనగర్‌లో ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుచరులు సమైక్యవాదులపై జరిపిన దాడిని ఖండిస్తూ బంద్ కార్యక్రమం జరిగింది. సబ్-కలెక్టర్ కార్యాలయం వద్ద టీచర్ల జేఏసీ ఆధ్వర్యంలో మోకాళ్లపై నడిచి నిరశన తెలిపారు.