చీకటిని జయించిన రాజు

Blind Person Performing Good Cricket In District Level In Kurnool - Sakshi

సాధించాలన్న తపన ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. అందుకు వయస్సు, అంగ వైకల్యం అడ్డురాదు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఆ కళ్లే లేకుంటే ప్రపంచమే అంధకారం. కాని చూపు లేకున్నా తాను ఎవ్వరికీ ఎందులోనూ తీసిపోనని నిరూపించారు పుష్పరాజ్‌. చిన్నప్పుడే కంటి చూపుకోల్పోయినా ఉన్నత చదువులు చదివి ప్రధానోపాధ్యాయుడి స్థాయికి చేరుకున్నారు. మరో వైపు క్రికెట్‌లో రాణిస్తూ ఎన్నో పతకాలను కైవసం చేసుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచారు.  

సాక్షి, కర్నూలు : కర్నూలు నగరానికి చెందిన సిమ్మన్స్, రాజేశ్వరి దంపతులకు పుష్పరాజ్, అశోక్‌ సంతానం. ఇందులో పెద్ద కుమారుడు పుష్పరాజ్‌.. చిన్న వయస్సులోనే కంటి చూపును కోల్పోయారు. అతనికి ఏడవ ఏటవచ్చే సరికి తండ్రి చనిపోయారు. తల్లి రాజేశ్వరి అధైర్యపడకుండా కర్నూల్లోని ఓ ప్రవేయిటు పాఠశాల్లో ఆయాగా చేరారు. పేదరికంలో ఉన్నప్పటికీ కుమారుడు పుష్పరాజ్‌కు కంటి చూపును తెచ్చుకోపవడానికి ప్రయత్నించారు. అప్పుచేసి ఎనిమిది సార్లు శస్త్ర చికిత్సలు చేయించారు. అయానా ఫలితం దక్కలేదు.

పుష్పరాజ్‌ను ఉన్నత చదువులను చదివించాలని భావించి హైదరాబాద్‌లో ఉన్న దేవనగర్‌ అంధుల పాఠశాల్లో చేర్పించారు. అక్కడ 10వ తరగతి పూర్తిచేశారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో 490 మార్కులను సాధించి అప్పటి రాష్ట్ర గవర్నర్‌గా పని చేసిన రంగరాజన్‌ చేతులమీదుగా ఉత్తమ విద్యార్థిగా పురస్కారాన్ని అందుకున్నారు. పాఠశాల స్థాయిలో క్రికెట్‌లో మెలకువలు నేర్చుకున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మంచి బ్యాట్స్‌మెన్‌గా రాణించారు.  

సంరక్షుడి నుంచి ఉపాధ్యాయుడిగా.. 
పదో తరగతి అనంతరం పుష్పరాజ్‌.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌లో హెచ్‌ఈసీ గ్రూపు తీసుకున్నారు. నిజాం కళాశాలలో బీఏ చదివారు. హైదరాబాద్‌లోనే వసతి గృహంలో ఉంటూ బీఈడీను పూర్తి చేశారు. క్రికెట్‌లోనూ రాణిస్తూ అందరి మన్ననలు అందుకున్నారు. భారత అంధుల క్రికెట్‌ జట్టుకు సేవలు అందించారు. వసతి గృహ సంరక్షుడి ఉద్యోగానికి ఎంపికై మద్దికెరలో రెండేళ్లు పనిచేశారు. విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను 2007లో ఉత్తమ వసతి గృహ సంరక్షుడి ఆవార్డు వరించింది.

అదే ఏడాదిలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో సన్మానం అందుకున్నారు. క్రికెట్‌లో రాణించినందుకు  2012లో అప్పటి సీఎం కిరుణ్‌కుమార్‌రెడ్డి చేత సన్మానాన్ని పొందారు. స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం రావడంతో వసతి గృహ సంరక్షుడి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆలూరు బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి పనిచేస్తున్నారు.

మారుతున్న కాలంతోపాటు సాంకేతికతను పుష్పరాజ్‌ అందిపుచ్చుకున్నారు. తన ల్యాప్‌టాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించడంలో పుష్పరాజ్‌ దిట్ట. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సైతం ఈయన కైవసం చేసుకున్నారు. 

ధైర్యమే నా ఆయుధం.. 
వైకల్యం ఉందని బాధపడితే నేను ఈ స్థాయిలో ఉండేవాన్ని కాదు. ధైర్యమే ఆయుధంగా ముందుకు సాగాను. ప్రస్తుతం ఆలూరు ప్రభుత్వ బాలుర పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నాను. నా విజయానికి కృషి, పట్టుదల, క్రమశిక్షణే కారనం. కంటిచూపు లేదని నేను ఎన్నడూ బాధపడలేదు. అమ్మ ప్రోత్సాహంతో ఈస్థితికి చేరుకున్నాను. ప్రతి ఒక్కరిలో ఏదో రకమైన ప్రతిభ దాగి ఉంటుంది, దానిని వెలికి తీసినప్పుడు విజయం తప్పక వరిస్తుంది.
– పుష్పరాజ్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top