ఓ వృద్ధురాలు రాయచోటి పట్టణ నడి బొడ్డున ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా వైఎస్సార్ విగ్రహం కింద తలదాచుకుంటోంది.
అయ్యో.. అమ్మ
Feb 22 2016 8:18 AM | Updated on Sep 5 2018 2:12 PM
చివరి మజిలీలో రోడ్డుపాలైన మాతృమూర్తి
వారం రోజులపాటు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం
చలికి వణుకుతూ..ఆకలితో అలమటిస్తున్న ఓ వృద్ధురాలు
రాయచోటి టౌన్ : సృష్టి కర్త బ్రహ్మ అయితే .. ఆ బ్రహ్మను సృష్టించేది మాత్రం అమ్మే కదా..! అవును మరి ఎంత పెద్దవాడైనా.. ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా తల్లి దీవెన, తాపత్య్రం, ఆమె కష్టం లేకుండా ఏ బిడ్డా ఉన్నత స్థానానికి ఎదగలేరు. కానీ చివరి మజిలీలో మాత్రం ఆ తల్లికే ఆదరణ కరువవుతోంది. కనికరం లేకుండా నడి రోడ్డుపై వదిలేసి చేతులు దులుపేసుకుంటున్నారు. ఇలాంటి కోవకు చెందిన ఓ వృద్ధురాలు రాయచోటి పట్టణ నడి బొడ్డున ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా వైఎస్సార్ విగ్రహం కింద తలదాచుకుంటోంది. అర్ధరాత్రి దాటాక అక్కడ ఎవరో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆమెకు కళ్లు కనిపించవు, చెవులు వినిపించవు. ఎవరైనా దగ్గరకు వెళ్లి నీవు ఎవరు, నీ పేరు ఏమిటీ అని అడిగితే మాత్రం శక్తినంతా కూడదీసుకుని తన పేరు, ఊరు పేరు మాత్రమే చెబుతోంది. ఆమె పేరు భూమారపు చిన్నక్క (సుమారు 85-90 ఏళ్ల మధ్య వయసు ఉండొచ్చు). ఊరు రామాపురం మండలం పాలన్నగారిపల్లె. వారం రోజుల క్రితం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిందని, వైద్యం చేయించి సమీప బంధువులు వచ్చి తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
అయితే ఆ తల్లి మాత్రం ఇక్కడికి ఎలా వచ్చానో తనకు తెలియదని, పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని మావాళ్లు చితకబాది ఇలా రోడ్డుపై పడేసి వెళ్లిపోయారని చె బుతోంది. ఇతరుల సాయంతో కూడా నడవలేని ఆ తల్లి ఎవరో వదిలేయకపోతే ఇలా నడి రోడ్డుపైకి ఎలా వస్తుందని స్థానికులు అంటున్నారు. శనివారం రాత్రి ఆమె రోడ్డుపై చలికి వణుకుతున్న దుర్భర స్థితిని చూసి చలించి స్థానికుడు చెంగా ఈశ్వరయ్య ఆమెకు ఒక దుప్పటి తీసుకొచ్చి కప్పి, భోజనం తీసుకొచ్చి ఇతరుల సాయంతో ఆమెకు అన్నం తినిపించారు. తెల్లవారి మళ్లీ ఆమెకు టిఫెన్ కూడా తీసుకొచ్చి ఇవ్వడంతో నీరసం నుంచి కాస్త తేరుకుని వైఎస్సార్ విగ్రహం కింద సేద తీరుతోంది. ఈమె దీన పరిస్థితి చూసిన వారు అయ్యో.. తల్లిని నడి రోడ్డున వదిలేశారే అనుకుంటున్నారు. ఆదరణ కల్పించే వారి కోసం ఆమె ఎదురు చూస్తోంది.
Advertisement
Advertisement