పేరు గ్లోబల్... అంతా గోబెల్స్ | Sakshi
Sakshi News home page

పేరు గ్లోబల్... అంతా గోబెల్స్

Published Thu, May 21 2015 2:19 AM

Beraitis with the massive irregularities in tenders for sale

గతంలో వైఎస్సార్ ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల ద్వారా అంతర్జాతీయ సంస్థల మధ్య పోటీ నెలకొల్పి ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగకుండా బెరైటీస్ ధర నిర్ణయించింది. దీనికి విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం లోపాయికారీ ఒప్పందాలతో ప్రైవేటు సంస్థల జేబులు నింపేందుకు కుట్ర పన్నింది. వాటికి అప్పనంగా లాభాలు చేకూర్చేందుకు  ఏకంగా తన జీవోలను తానే సవరించుకుంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలో 70-75 శాతం కనీస ధర నిర్ణయించాలన్న నిపుణుల కమిటీ సిఫార్సును కాదని,  బెరైటీస్ కనీస ధరను  65 శాతానికి తగ్గించింది. గ్లోబల్ టెండర్లంటూ గోబెల్స్ ప్రచారంతో స్థానిక కోటా రద్దు చేసి 218 పరిశ్రమలు మూతపడేలా చేసింది. తద్వారా సుమారు 50 వేల మంది ఉద్యోగులు, కార్మికుల ఉపాధికి గండికొట్టి వీధులపాలు చేసింది.
 
హైదరాబాద్: బెరైటీస్ విక్రయ టెండర్ల వ్యవహారంలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. టెండర్ల ద్వారా రాబడి పెంచుకోవాల్సిన ప్రభుత్వమే ఖజానాకు గండికొట్టి ప్రైవేటు సంస్థల జేబులు నింపేందుకు సహకరించింది. చంద్రబాబు సర్కారు గత జనవరి 27వ తేదీ జారీ చేసిన జీవో 22ను సవరిస్తూ ఈ నెల 4న జారీ చేసిన జీవో 163 ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ప్రభుత్వ పెద్దల ప్రత్యక్ష అండదండలుండటంతో ఈ నెల 8న జరిగిన టెండర్లలో పాల్గొన్న నాలుగు ప్రైవేటు సంస్థలు రింగ్‌గా మారి తక్కువ ధరకే ఖనిజాన్ని కైవసం చేసుకున్నాయి. వైఎస్సార్ (కడప) జిల్లా మంగంపేట ప్రాజెక్టులోని బెరైటీస్ ఖనిజాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని గత జనవరిలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.


ధర నిర్ణయించేందుకు టీడీపీ సర్కారు నిపుణుల కమిటీని నియమించింది. చెన్నైలో ప్రకటించే అంతర్జాతీయ మార్కెట్ ధరలో 70 - 75 శాతం కనీస (బేసిక్)ధరగా నిర్ణయించి బెరైటీస్ విక్రయానికి గ్లోబల్ టెండర్లు నిర్వహించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. (టన్ను బెరైటీస్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. వెయ్యి ఉంటే  రూ. 700 - 750 మధ్య కనీస ధర నిర్ణయించాలి). ఈ మేరకు ప్రభుత్వం జనవరి 27న జీవో 22 జారీ చేసింది. దీని ప్రకారం టన్ను ధర ‘ఎ’ గ్రేడ్ రూ.6,750, ‘బి’గ్రేడ్ రూ. 5,360 (అంతర్జాతీయ ధరలో సుమారు 71 శాతం) ఖరారు చేసి గత ఫిబ్రవరి 15న ఏపీఎండీసీ మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ ద్వారా గ్లోబల్ టెండర్లు ఆహ్వానించింది. అంతర్జాతీయ సంస్థలు పోటీకి రాకుండా స్థానిక సంస్థలు, ప్రభుత్వం రాజకీయం నడిపాయి.  


ముందే కుదిరిన ఒప్పందంతో...
ముందే వాటితో కుదిరిన ఒప్పందం మేరకు ప్రభుత్వం బెరైటీస్ కనీస ధరను అంతర్జాతీయ మార్కెట్ ధరలో 65 శాతానికి తగ్గించి టన్ను ‘ఎ’ గ్రేడ్ రూ. 6000, ‘బి’ గ్రేడ్ రూ. 4,750కి నిర్ణయించింది. ఈ మేరకు తగ్గించిన కనీస ధరతో టెండర్లు ఆహ్వానిస్తూ ప్రభుత్వం గత నెల 14న రెండో విడత టెండర్లు ఆహ్వానించింది. ఇలా అంతర్జాతీయ మార్కెట్ ధరలో 65 - 70 శాతానికి కనీస ధరను తగ్గించేందుకు వీలుగా జీవో 22ను సవరిస్తూ ప్రభుత్వం ఈ నెల4గున జీవో 163 జారీ చేసింది. టెండర్లలో పాల్గొనే సంస్థలకు 25 నుంచి 30 శాతం లాభం చాలదంటూ ప్రభుత్వం కనీస ధరను 65 శాతానికి తగ్గించడం ద్వారా 35 శాతం లాభం ఉండేలా చేసింది.


ఈ మేరకు ముందే ధరలు తగ్గించి టెండర్లు ఆహ్వానించి తర్వాత ఈ జీవో జారీ  చేసింది. నిపుణుల సిఫార్సుల మేరకు బెరైటీస్ కనీస ధరను నిర్ణయించిన ప్రభుత్వం  నిర్ణయం మార్చుకుని ధరలను తగ్గించడంలో భారీ మతలబు ఉందని, ఈ వ్యవహారం వెనుక కీలక నేత పాత్ర ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ధరలు తగ్గించడంవల్ల ఏపీఎండీసీ కేవలం నాలుగు లక్షల టన్నుల ఖనిజానికి రూ. 28 కోట్ల రాబడి కోల్పోయింది. టెండర్లలో పాల్గొన్న ట్రైమాక్స్, ఆశాపురం, ఓరన్ హైడ్రో కార్బన్, ఆశాపుర సంస్థలు రింగ్‌గా మారి కనీస ధరకే టెండర్లు దక్కించుకోవడంవల్ల ఏపీఎండీసీ రూ. 150 కోట్ల వరకూ ఆదాయం కోల్పోయినట్లేనని అధికారులు అంటున్నారు. పోటీ ఏర్పడితే బేసిక్ ధరపై రూ. 1500 వరకూ అదనంగా రేటు పలికేదని వారు పేర్కొన్నారు.

Advertisement
Advertisement